శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 17:40:19

కొయ్యకు నల్లకోటు.. కోర్టులకు కొత్త డ్రెస్‌కోడ్

కొయ్యకు నల్లకోటు.. కోర్టులకు కొత్త డ్రెస్‌కోడ్

న్యూఢిల్లీ: కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమే మారిపోయింది. ఇప్పుడు ఆ మార్పు న్యాయ వ్యవస్థ వేషభూషలను తాకింది. జడ్జీలు, న్యాయవాదులు ఇక నల్లకోటును చిలుక్కొయ్యకు తగిలించాల్సిందే. కనీసం కరోనా వైరస్ ఉన్నంత వరకు. నల్లకోటు, నల్ల గౌను వేసుకోవద్దని, త్వరలో కొత్త డ్రెస్ కోడ్ ప్రకటిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబడే చెప్పారు. బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు తెల్లషర్టులు, నెక్‌బ్యాండులతో బెంచ్ మీదకు వచ్చారు. 'నల్లకోట్లు, గౌన్లు పక్కన పెట్టండి. వాటితో వైరస్ త్వరగా పట్టుకుంటుంది' అని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బోబడే అన్నారు. వీడియో కాన్పరఎన్సుల ద్వారా విచారణలు జరుపుతూ వచ్చిన న్యాయమూర్తులు మంగళవారం నుంచి మళ్లీ కోర్టుకు వస్తున్నారు. అయితే వాదిప్రతివాదులు మాత్రం ఇప్పటికీ వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే వాదనలు వినిపిస్తున్నారు. మంగళవారం మరో కేసు విచారణ సందర్బంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సందేహాన్ని నివృత్తి చేస్తూ, వచ్చేవారం నుంచి కోర్టులోనే విచారణలు చేపడతామని, అయితే న్యాయవాదులు మాత్రం చాంబర్ నుంచి వాదనలు వినిపించాలని న్యాయమూర్తి నాగేశ్వరరావు చెప్పారు. అయితే దీనిని ఆయన ఓ పైలట్ ప్రాజెక్టుగా అభివర్ణించడం విశేషం.


logo