గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 17:29:49

వచ్చే ఏడాది కరోనాకు టీకా వస్తుంది : కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

వచ్చే ఏడాది కరోనాకు టీకా వస్తుంది : కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ 15 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. 400కు పైగా జనం మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచంతో పోలిస్తే భారతదేశం కరోనతో మెరుగ్గా పోరాడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఆదివారం ఆయన ఓ జాతియా మీడియా సంస్థతో మాట్లాడుతూ కరోనా పరీక్షలను పెంచామని అదే విధంగా భారత్‌లో మరణాల రేటు కుడా తక్కువగానే ఉందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాది నాటికి కరోనాకు టీకా కూడా వస్తుందన్నారు. కరోనా కూడా ఇతర వ్యాధుల మాదిరిదేనని, కానీ మన జీవనశైలిని మార్చుకోవాల్సి వస్తుందని ఆయన సూచించారు. 

భారత్‌లో కరోనా మొదటి కేసు జనవరి 30న వచ్చిందని,  దేశ జనాభా 130 కోట్లు కాగా, ప్రస్తుతం 5 లక్షల కేసులున్నాయని అందులో 3.10లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో కేవలం 3 శాతం మాత్రమే మరణ రేటు ఉందని, ఇది అత్యంత తక్కువన్నారు. మనకంటే బ్రెజిల్‌, యూకే, యూఎస్‌లో మరణాల రేటు ఎక్కువగా ఉందన్నారు. 

5 నెలల క్రితం ఒక్క ప్రయోగశాల ఉంటే ఉప్పుడు 1036 ప్రయోగశాలల్లో లక్షల్లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు. మనం మెరుగైన స్థితిలో ఉన్నామని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని వైరస్‌లు వస్తూనే ఉంటాయని వాటిని మనం సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. 

వ్యాక్సిన్‌ను కనుగొనడానికి ప్రపంచమంతా కృషి చేస్తోందని, భారతదేశంలో కూడా దీనిపై పరిశోధన జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది వ్యాక్సిన్‌ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాందేవ్‌ బాబా విడుదల చేసిన కరైనల్‌ ఔషధంపై ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తుందన్నారు. త్వరలో ఈ ఔషధంపై ఖచ్చితమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 


logo