e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జాతీయం పిల్లలపై పంజా

పిల్లలపై పంజా

పిల్లలపై పంజా
  • వైరస్‌ బాధితులుగా నవజాత శిశువులు
  • ఐదేండ్లలోపు పిల్లలు, యువతపైనా ప్రభావం
  • అత్యంత ప్రమాదంగా సెకండ్‌ వేవ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ (కరోనా రెండో ఉద్ధృతి) బీభత్సం సృష్టిస్తున్నది. రోజూ సగటున రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే గతేడాదితో పోలిస్తే, ఈ సెకండ్‌ వేవ్‌ అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నవజాత శిశువు మొదలుకొని ఐదేండ్ల చిన్నారి వరకు అందరూ మహమ్మారి బాధితులుగా మారుతున్నట్టు చెబుతున్నారు. కరోనాతో దవాఖానలో చేరుతున్న పిల్లల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఐదురెట్లు ఎక్కువగా ఉన్నదని ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ దవాఖాన వైద్యుడు డాక్టర్‌ ధీరన్‌ గుప్తా అన్నారు. ఈసారి పిల్లల్లో కూడా వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ దవాఖాన వైద్యురాలు, అత్యవసర విభాగం చీఫ్‌ డాక్టర్‌ రితూ సక్సేనా తెలిపారు. ‘పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్ల చిన్నారికి కూడా మహమ్మారి సోకుతున్నది. ఇప్పటికే వైరస్‌ లక్షణాలతో ఏడెనిమిది మంది పిల్లలు మా దవాఖానలో చేరారు’ అని సక్సేనా పేర్కొన్నారు. రెండో విడుతలో తీవ్రంగా ప్రభావితమైన ఐదు రాష్ర్టాలు- మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, ఢిల్లీలలో మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 4 మధ్య 80వేల మందికిపైగా పిల్లలకు కరోనా సోకినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత మరింత ఎక్కువగాకేసులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

యువతపైనా అధిక ప్రభావం

మొదటి దశతో పోలిస్తే రెండో దశలో కరోనా మహమ్మారి యువతపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నదని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీలో కరోనా బాధితుల్లో 65 శాతం మంది 45 ఏండ్లలోపువారేనని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇటీవలే వెల్లడించారు. మొదటి దశలో, గతేడాది డిసెంబర్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం కేసుల్లో 60 శాతం మంది 45 ఏండ్లులోపు వారుకాగా, మృతుల్లో మాత్రం వయోధికులే (88 శాతం)ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత రెండో దశలో.. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో వైరస్‌ బారిన పడుతున్నవారిలో దాదాపు 50 శాతం మంది 45ఏండ్లలోపువారే.

అప్పుడు అంతటా.. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉద్ధృతంగా..

మొదటి దశలో వైరస్‌ వ్యాప్తి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉండగా, రెండో దశలో మాత్రం వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తిచెందుతూ కొన్ని ప్రాంతాలకే పరిమితమైనది. మొదటి విడుతలో దేశంలోని మొత్తం కేసుల్లో 50 శాతం కేసులు 40కి పైగా జిల్లాల్లో నమోదుకాగా, ప్రస్తుతం 20 జిల్లాల్లోనే 50 శాతానికిపైగా కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్‌వేవ్‌ పీక్‌ స్టేజిలో ఉన్న ఆగస్టు-సెప్టెంబర్‌ మాసాల మధ్య దేశంలో 75 శాతం కేసులు 60-100 జిల్లాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం 20-40 జిల్లాల్లోనే 75 శాతం కేసులు నమోదవుతున్నాయి.

ఉప్పెనలా సెకండ్‌వేవ్‌

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉప్పెనలా విరుచుకుపడుతున్నది. ఏప్రిల్‌ తొలి అర్ధభాగంలోనే దేశంలో 20.65 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి వైరస్‌ ఎంతవేగంగా విస్తరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే, మొదటి దశతో (ఫస్ట్‌వేవ్‌తో) పోలిస్తే రెండో దశలో (సెకండ్‌ వేవ్‌లో) వైరస్‌ వ్యాప్తి, లక్షణాలు, వ్యాధిబారిన పడుతున్న వయోవర్గం.. తదితర అంశాల్లో పలు వ్యత్యాసాలు ఉన్నాయి.

స్థానికంగా ఉత్పరివర్తనాలు

దేశంలో మొదటి దశలో స్థానిక వేరియంట్లు (స్థానికంగా కనిపించే కరోనా వైరస్‌ రకాలు) పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ప్రస్తుత సెకండ్‌ వేవ్‌లో మాత్రం వీటిదే ప్రధాన పాత్ర. మహారాష్ట్రలో వెలుగుచూస్తున్న కేసుల్లో దాదాపు 60 శాతం స్థానిక ఉత్పరివర్తనాలకు సంబంధించినవేనని నిపుణులు చెబుతున్నారు.

కొత్త లక్షణాలు

జ్వరం, ఒళ్లు నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం, శ్వాస సంబంధిత సమస్యలు తొలి, రెండో దశల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే రెండో దశలో మాత్రం పలు కొత్త లక్షణాలను వైద్యులు గుర్తించారు. కళ్లు గులాబీ రంగులోకి మారడం, నీళ్ల విరేచనాలు, వినికిడి సమస్య తదితర లక్షణాలు ప్రస్తుతం రెండో దశలో కనిపిస్తున్నట్టు
తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పిల్లలపై పంజా

ట్రెండింగ్‌

Advertisement