శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 08:24:47

కరోనా ప్రభావం.. వృద్దులకు ఇంటివద్దకే ఆహారం

కరోనా ప్రభావం.. వృద్దులకు ఇంటివద్దకే ఆహారం

పశ్చిమ బెంగాల్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రాని పరిస్థితి ఎదురైంది. ఈ ఆపత్కాల సమయంలో వృద్ధులు ఇబ్బంది పడవద్దని కోల్‌కతాలోని కొందరు యువతులు వారికి ఉచితంగా ఆహరం, ఔషధాలు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో వృద్ధులు ఇబ్బంది పడకూడదని వారికి ఆహారం, ఔషధాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది జంతు ప్రేమికురాలైన 28 ఏళ్ల కశికా ఆరోరా. దక్షిణ కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో ఆమె జంతువుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వాటికి పోషకాహారం అందిస్తోంది. కోల్‌కతాలో ఒంటరి వృద్ధులు చాలా మంది ఉన్నారు. విదేశాల్లో పిల్లలు ఉన్నవారు, పిల్లల ఆదరణకు నోచుకోలేని వారు ఉన్నట్లు గుర్తించిన కశికా తన స్నేహితురాళ్లతో విషయం పంచుకుంది. సిటీలో ఎక్కడ వృద్ధులున్నా వారికి ఉచితంగా ఆహారం, మందులు, బియ్యం, పప్పు, శానిటరీ నాప్‌కిన్స్‌, శానిటైజర్స్‌ లాంటివి అందించాలని నిర్ణయించుకున్నారు. 

ఇల్లిళ్లూ తిరిగి తనిఖీ చేశారు. ప్రతి అపార్టుమెంటులో పదుల సంఖ్యలో వృద్ధులు ఉండడం గమనించారు. నిత్యావసర వస్తువుల కోసం మీరెవరూ బయటకు రావద్దనీ.. మీకసరమైనవన్నీ మేమందిస్తామని వారికి భరోసా ఇచ్చారు. సోషల్‌మీడియను కూడా వాడుకోవాలన్నారు. తమకు తెలిసిన వృద్ధులెవరైనా నిత్యావసరాలకు ఇబ్బంది పడితే సమాచారమివ్వండి అని సోషల్‌మీడియాలో పోస్టు పెడితే 24 గంటలు దాటకముందే పదికి పైగా అభ్యర్థనలు వచ్చాయి. బాధితుల సంఖ్య పెరిగితే సరుకుల సంఖ్య కూడా పెంచుతున్నారు. 

ఆహారధాన్యాలు, పచారీ వస్తువులు, కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు, రొట్టెలు, పాలు, వైద్య సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటిని తీసుకెళ్లడానికి తన దగ్గర ఉన్న పెట్‌ వెహికిల్‌ని వాడుతున్నారు కశికా. సరుకుల పంపిణీ విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులకు సమాచారం అందించింది.  


logo