న్యూఢిల్లీ, జూన్ 4: దేశంలో తొలిసారిగా వెలుగుచూసిన డెల్టా వేరియెంట్ (బీ.1.617.2) తీవ్రతకు సంబంధించి వెలువడుతున్న తాజా విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో సెకండ్‌వేవ్ ఉద్ధృతికి ఈ వేరియెంటే కారణమని ఐఎన్ఎస్ఏసీవోజీ అధ్యయనం పేర్కొనగా, ఈ వేరియెంట్‌పై ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావం అంతంత మాత్రమేనని ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్’ వెల్లడించింది.
డెల్జాతో జాగ్రత్త..
బ్రిటన్‌లో వెలుగు చూసిన ఆల్ఫా వేరియంట్ (బీ.1.617) శ్రేణిలోని మూడు వేరియంట్లలో డెల్టా వేరియంటే వేగంగా వ్యాపిస్తున్నట్టు ప్రభుత్వ అధ్యయనం ఒకటి పేర్కొంది. వైరస్ జన్యుక్రమాలపై పరిశోధనలు చేస్తున్న దేశంలోని పది జాతీయ ప్రయోగశాలల నిపుణులతో ఏర్పాటుచేసిన ఇండియన్ సార్స్ కొవ్-2 కన్సార్షియమ్ ఆన్ జీనోమిక్స్ (ఐఎన్ఎస్ఏసీవోజీ) ఓ అధ్యయనంలో వివరించింది. డెల్టా వేరియంట్ మినహా మిగిలిన రకాలు తీవ్రస్థాయిలో వ్యాపించడంలేదన్నది.
ఎక్కువ గ్యాప్ వద్దేవద్దు!
ఫస్ట్‌వేవ్‌తో వెలుగుచూసిన కరోనా వైరస్‌తో పోలిస్తే, డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడంలో ఫైజర్ టీకా ఉత్పత్తి చేసే యాంటీ బాడీలు ఐదు రెట్లు తక్కువగా ఉన్నట్టు బ్రిటన్‌లోని ‘ఫాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్’ పరిశోధకులు జరిపిన అధ్యయనం పేర్కొంది. దీంతో డెల్టాతో ముప్పు ఎక్కువగా ఉండే అవకాశమున్నదని, వారికి బూస్టర్ డోసూ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. అలాగే డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఫైజర్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించడం మంచిదని, ఈ విషయంలో బ్రిటన్ నిర్ణయం సరైందేనని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే యాంటీబాడీలు ఫైజర్ ఒక్క డోసుతో ఉత్పత్తి కావడంలేదని తెలిపారు. మరోవైపు కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో తల్లడిల్లిన బ్రిటన్ను తాజాగా డెల్టా వేరియెంట్ భయపెడుతున్నది.