గురువారం 16 జూలై 2020
National - Jun 23, 2020 , 17:26:30

మాయదారి కరోనా.. రోడ్డున పడేసింది..!

మాయదారి కరోనా.. రోడ్డున పడేసింది..!

  • అస్సాం గుహవాటిలో వీధి వ్యాపారుల పరిస్థితి దయనీయం
  • గిరాకీ లేక వెలవెలబోతున్న వ్యాపారాలు
  • పూట గడవని స్థితిలో కుటుంబాలు

అస్సాం : మాయదారి కరోనా వందలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. చేతివృత్తిదారులు లాక్‌డౌన్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో గిరాకీ లేక పూట గడిచే పరిస్థితి లేకుండా పోతోంది. సుమారు ౩ నెలలుగా చాలా మంది తమ వ్యాపారాలను బంద్‌ పెట్టి ఇంటి వద్దే ఖాళీగా కూర్చున్నారు. కిరాయి ఇండ్ల వారు అద్దె కూడా చెల్లించలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తేయడంతో చాలా మంది తమ వీధి వ్యాపారాలను పునఃప్రారంభించారు. కరోనా భయంతో జనం బిక్కుబిక్కుమంటూ.. అత్యవసరం అయితే తప్ప బయటికి రావడం లేదు. దీంతో కొనుగోలు చేసేవారు లేక వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. 


అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో మట్టి కుండలు తయారు చేసి విక్రయించే వ్యపారులు గిరాకీ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మట్టి కుండలకు డిమాండ్‌ తగ్గడం, అందులో కొవిడ్‌19 విజృంభిస్తుండడంతో జనం ఇటువైపు రావడమే మానేశారు. వారాల తరబడి కష్టపడి మట్టితో కుండలు తయారుచేసి విక్రయానికి పెడితే ఒక్క పాత్ర కూడా అమ్ముడు పోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

‘ ఇదే మాకు జీవనోపాధి.. కానీ కస్టమర్లు లేక మా వ్యాపారం వెలవెలబోతోంది. స్టాళ్లు తెరిచినందుకు కొంతమంది మమ్మల్ని బెదిరిస్తున్నారు. కానీ మా కడుపు నిండడమెలా?.. మా జీవితాలు దయనీయంగా మారాయి.. ఇన్ని రోజులు వ్యాపారాన్ని మూసివేశాం.. కాని ఇప్పుడు కూడా తెరుచుకోక పోతే మాకు పూట గడవడం కూడా కష్టంగా మారుతుంది’ అని ఒక కుండల వ్యాపారి తెలియజేశాడు. 


అస్సాంలో ఇప్పటివరకు 5853 కరోనా కేసులు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 3566 మంది కోలుకోగా.. 2275 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9 మరణాలు సంభవించాయి. 


logo