సోమవారం 30 మార్చి 2020
National - Mar 21, 2020 , 19:03:59

కేరళలో 52కు చేరిన ‘కరోనా’ కేసులు..

కేరళలో 52కు చేరిన ‘కరోనా’ కేసులు..

తిరువనంతపురం: రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు 52కు చేరినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెల్లడించారు. ఇవాళ మరో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఈ పన్నెండు మంది కరోనా బాధితులు గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చినట్లు సీఎం పేర్కొన్నారు. పన్నెండు మంది బాధితుల్లో ముగ్గురు కన్నూరుకు చెందినవారు కాగా.. 6 మంది కాసరగాడ్‌, ముగ్గురు ఎర్నాకుళం ప్రాంతానికి చెందినవారని సీఎం మీడియాకు వివరించారు.  వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచామని, వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.

కరోనా కేసులు నానాటికి పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 300 పైగా చేరగా, అత్యధికంగా మహారాష్ట్ర, కేరళలోనే నమోదయ్యాయి. తెలంగాణలో 21 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 19 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోనూ కరోనా వైరస్‌ ప్రబలుతోంది.

ప్రధాని పిలుపు మేరకు రేపు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను పాటించి, ప్రతి ఒక్కరూ కరోనా నివారణకు పాటుపడాలని ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లోనూ.. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలని పోస్టులు పెడుతున్నారు. 


logo