శనివారం 04 జూలై 2020
National - Jun 29, 2020 , 09:54:30

దేశంలో 5.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు

దేశంలో 5.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విస్తరిస్తున్నది. మహమ్మారి ఉగ్రరూపం దాల్చడంతో ప్రతిరోజు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఉదయం వరకు 19,906 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా 19,459 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల ఒకేరోజు 380 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,48,318కి చేరగా, మృతుల సంఖ్య 16,475కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 2,10,120 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇప్పటివరకు 3,21,273 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. 

కరోనా కేసుల్లో అగ్రస్థానాల్లో ఉన్న రాష్ర్టాలు 

దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ర్టాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,64,626 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 7,429 మంది బాధితులు మృతిచెందగా, 86,575 మంది కోలుకున్నారు. మరో 70,622 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 83,077కి చేరగా, 2623 మంది మరణించారు. తమిళనాడులో ఇప్పటివరకు 82,275 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1079 మంది మృతిచెందారు. నాలుగో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 31,320 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1808 మంది మరణించారు. 31,320 పాజిటివ్‌ కేసులతో ఉత్తరప్రదేశ్‌ ఐదో స్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 660 మంది చనిపోయారు.

ఒకేరోజు 1,70,560 పరీక్షలు: ఐసీఎమ్మార్‌

జూన్‌ 28 వరకు దేశవ్యాప్తంగా 83,98,362 నమూనాలను పరీక్షించామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. నిన్న ఒక్కరోజే దేశంలో 1,70,560 పరీక్షలు చేశామని తెలిపింది.


logo