మంగళవారం 26 మే 2020
National - May 08, 2020 , 02:34:24

జూన్‌-జూలైలో కరోనా విజృంభణ!

జూన్‌-జూలైలో కరోనా విజృంభణ!

  • ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా

న్యూఢిల్లీ: రానున్న రెండు నెలల్లో దేశంలో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశమున్నదని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అంచనా వేశారు. ‘ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల సరళిని పరిశీలిస్తే, రానున్న జూన్‌, జూలైలో వైరస్‌ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నది’ అని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా వివిధ దేశాలతో పోలిస్తే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని గులేరియా పేర్కొన్నారు. వైరస్‌ ప్రభావం ఇంకెంత కాలం కొనసాగుతుందో చెప్పడం కష్టమని వివరించారు. అయితే, ఉద్ధృత స్థితి (పీక్‌ స్టేజ్‌)ని దాటాక వైరస్‌ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుందని చెప్పారు. దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగడానికి కారణం అధికంగా పరీక్షల్ని నిర్వహించడమేనని చెప్పారు. కొన్ని ప్రాంతాలు, క్లస్టర్లలోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయన్న ఆయన, హాట్‌స్పాట్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.


logo