శనివారం 04 జూలై 2020
National - Jun 20, 2020 , 20:45:57

వ‌రుడికి క‌రోనా పాజిటివ్.. మ‌ధ్య‌లోనే ఆగిన పెళ్లి

వ‌రుడికి క‌రోనా పాజిటివ్.. మ‌ధ్య‌లోనే ఆగిన పెళ్లి

ల‌క్నో : కాసేప‌ట్లో పెళ్లి.. వ‌ధువు నివాసానికి డ్యాన్సులు చేస్తూ వెళ్తున్నారు వ‌రుడితో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు. అంత‌లోనే పోలీసులు వ‌చ్చి వారిని ఆపారు. అంతా అయోమ‌యం. కానీ అప్ప‌టికే పెళ్లి కుమారుడితో పాటు అత‌డి తండ్రి ర‌క్త న‌మూనాల‌ను క‌రోనా ప‌రీక్ష‌ల నిమిత్తం ఇచ్చారు. వారిద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పెళ్లి వేడుక‌ను మ‌ధ్య‌లోనే ఆపేశారు. వధువు ఇంటికి వారిని వెళ్ల‌నివ్వ‌లేదు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అమేథి జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఢిల్లీలో నివాసం ఉంటుంది. అయితే ఆ కుటుంబంలో ఓ యువ‌కుడికి పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో జూన్ 15న వారు అమేథికి వ‌చ్చి పెళ్లి ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఢిల్లీ నుంచి వ‌చ్చిన ఆ కుటుంబానికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు.. వారి నుంచి ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించారు.

ఇక పెళ్లి వేడుక‌కు కోసం వ‌రుడి కుటుంబ స‌భ్యులు.. వ‌ధువు ఇంటికి బ‌య‌ల్దేరారు. బ‌రాబంకి జిల్లాలోని వ‌ధువు నివాస‌మైన హైద‌ర్ గ‌ర్హ్ కు వెళ్తుండ‌గా.. వ‌రుడితో పాటు అత‌ని కుటుంబాన్ని మార్గ‌మ‌ధ్య‌లోనే పోలీసులు ఆపారు. పెళ్లి కుమారుడికి, తండ్రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు. అనంత‌రం వారిద్ద‌రిని ఐసోలేష‌న్ సెంట‌ర్ కు త‌ర‌లించారు. మ‌రో ప‌ది మందిని హోం క్వారంటైన్ లో ఉండాల‌ని సూచించారు. మొత్తానికి పోలీసుల అప్ర‌మ‌త్త‌తో ఈ వైర‌స్ నుంచి వ‌ధువుతో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. 


logo