మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 11:15:41

పోలీసు స్టేషన్‌ ముందు ఆవు మాంసం పంపిణీ

పోలీసు స్టేషన్‌ ముందు ఆవు మాంసం పంపిణీ

తిరువనంతపురం : కేరళ పోలీసులకు తమ మెనూలో నుంచి ఆవు మాంసాన్ని తొలగించడంతో.. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కోజికోడ్‌లోని ముక్కం పోలీసు స్టేషన్‌ ఎదుట ఆవు మాంసం, రొట్టెను కాంగ్రెస్‌ నాయకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ కే. ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పోలీసుల మెనూ నుంచి ఆవు మాంసం తొలగించడం సరైంది కాదన్నారు. సీఎం పినరయి విజయన్‌.. సంఘ్‌ ఆదేశాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీని విజయన్‌ కలిసిన తర్వాత రాష్ట్ర డీజీపీగా లోక్‌నాథ్‌ బెహేరాను నియమించారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో ఇదే లోక్‌నాథ్‌.. మోదీకి, అమిత్‌షాకు క్లీన్‌చీట్‌ ఇచ్చారని ప్రవీణ్‌ గుర్తు చేశారు. ఇప్పుడేమో పినరయి విజయన్‌ ఆదేశాలకు అనుగుణంగా లోక్‌నాథ్‌.. సంఘ్‌ ఎజెండాను అమలు చేస్తున్నారు అని ప్రవీణ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయన్‌ ద్వంద వైఖరిని ఎండగడుతామని ఆయన అన్నారు. అయితే ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులకు వారి మెనూ నుంచి ఆవు మాంసంను తొలగిస్తున్నట్లు కేరళ పోలీసు డిపార్ట్‌మెంట్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ ఆరోపణలు నిరాధారమైనవి అని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 


logo