శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 15:16:14

కాంగ్రెస్‌ ‘రైడ్‌ రాజ్‌’కు భయపడదు : సుర్జేవాలా

కాంగ్రెస్‌ ‘రైడ్‌ రాజ్‌’కు భయపడదు : సుర్జేవాలా

జైపూర్: కేంద్రం ‘రైడ్ రాజ్’ సృష్టించిందని, దానికి కాంగ్రెస్‌ భయపడదని ఆ పార్టీ ప్రధాన ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు. బుధవారం రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సోదరుడి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు జరిపిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరల్నిస్ట్‌ హత్యపై కూడా కాంగ్రెస్‌ నేత స్పందించారు. రాష్ట్రంలో 'గుండా రాజ్', ‘జంగిల్ రాజ్’ ఉన్నాయని విమర్శించారు. యూపీలో శాంతిభద్రతలు లేవని స్పష్టమవుతోందని, యూపీలో జర్నలిస్టుగా మారడం పాపంగా మారిందని అన్నారు. జోధ్‌పూర్‌లో అగ్రసేన్‌ గెహ్లాట్ ఇంట్లో జరిగిన దాడులపై స్పందిస్తూ.. ప్రధాని మోడీ దేశంలో ‘రైడ్‌ రాజ్‌’ను సృష్టించారు. కానీ, మేం భయపడడం లేదని అన్నారు.  రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కేంద్రం చేసిన జిమ్మిక్కులు విఫలమైనప్పుడు, గెహ్లాట్‌ అన్నయ్య ఇంట్లో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు.

శాసనసభ్యుడు కృష్ణ పూనియాతో సంబంధం ఉన్న ప్రదేశంలో దాడి చేయడానికి సీబీఐ బృందాన్ని పంపినట్లు తెలిపారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కేంద్రం వ్యూహాలు విఫలమయ్యాయని, దేశం కోసం పురస్కారాలను తెచ్చిన ఒలింపియన్‌ను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సుర్జేవాలా తెలిపారు. ‘సీఎం ఓఎస్‌డీని కూడా సీబీఐ విచారించింది, ఇప్పుడు ఆయన అన్నయ్న నివాసంలో ఈడీ దాడులు జరుగుతున్నాయని’ సుర్జేవాలా అన్నారు. కాగా, ఎరువుల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో భాగంగా సీఎం సోదరుడి ఇంట్లో తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆరోపణలపై ఎరువుల కేసులో అగ్రసేన్‌ రూ.7కోట్ల కస్టమ్స్‌ జరిమానాను ఎదుర్కొంటున్నారని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo