మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 11, 2020 , 15:07:01

డీడీసీ ఎన్నికల్లో గుప్కార్ కూటమితో కలిసి కాంగ్రెస్‌ పోటీ

డీడీసీ ఎన్నికల్లో గుప్కార్ కూటమితో కలిసి కాంగ్రెస్‌ పోటీ

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో త్వరలో జరగనున్న జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో సెక్యులర్‌ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ బుధవారం ధ్రువీకరించింది. గుప్కార్‌ కూటమితో కలిసి కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని కూటమి చైర్మన్‌ ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటించిన మరుసటి రోజే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పోటీ చేస్తామని వెల్లడించడం విశేషం. డీడీసీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా కూటమితో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. త్వరలో జరుగనున్న జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు లౌకిక పార్టీలతో ఎన్నికల సర్దుబాట్ల కోసం కాంగ్రెస్ వెళ్తుందని జమ్ముకశ్మీర్‌ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య ప్రతినిధి రవీందర్ శర్మ బుధవారం తెలిపారు. నవంబర్ 28-డిసెంబర్ 19 మధ్య ఎనిమిది దశల్లో జమ్ముకశ్మీర్‌లో డీడీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటుచేయడం, ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లోని ఏడు ప్రధాన పార్టీలు చేతులు కలిపి పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ)గా జతకట్టాయి. ఈ కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, అవామి నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం, సీపీఐ, జమ్ముకశ్మీర్‌ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీలు ఉన్నాయి.  రానున్న డీడీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారం రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఈ కూటమి నిర్ణయించింది. డీడీసీ ఎన్నికలలో కలిసి పోటీ చేసేంతవరకు కాంగ్రెస్ కూడా ఈ గ్రూపులో భాగమని జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా గతంలో పేర్కొన్నారు. "మేం అందరం కలిసి ఎన్నికల్లో పోరాడుతాం. మాకు ఎన్నికల చిహ్నం లేనందున ఉమ్మడి అభ్యర్థులతో మా పార్టీలకు చెందిన సంబంధిత చిహ్నాలపై పోటీ చేస్తాం" అని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ.. మా భావాలను అనుగుణంగా ఉన్న సెక్యులర్‌ పార్టీలతో కలిసి డీడీసీ ఎన్నికల్లో పాల్గొంటామని స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.