శనివారం 28 మార్చి 2020
National - Mar 05, 2020 , 02:44:40

కమల్‌నాథ్‌ కుర్చీకి ఎసరు!

కమల్‌నాథ్‌ కుర్చీకి ఎసరు!
  • 8 మంది ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకెళ్లారు
  • బీజేపీపై కాంగ్రెస్‌ సంచలన ఆరోపణలు
  • ఖండించిన బీజేపీ.. అది కాంగ్రెస్‌ అంతర్గత వివాదమని వ్యాఖ్య
  • మా ప్రభుత్వానికి ఢోకా లేదు: సీఎం కమల్‌నాథ్‌
  • ఎమ్మెల్యేలతో బీజేపీ వంద కోట్ల బేరం.. వీడియో బహిర్గతం

భోపాల్‌, మార్చి 4: మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. తమ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో భాగంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు హర్యానాలోని ఓ హోటల్‌కు తరలించారని కాంగ్రెస్‌ ఆరోపించడంతో కలకలం మొదలైంది. అయితే, ఈ ఆరోపణల్ని బీజేపీ కొట్టేసింది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నిందని మధ్యప్రదేశ్‌ ఉన్నత విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్‌ నేత జీతూ పట్వారీ ఆరోపించారు. ‘మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మాజీ మంత్రులు నరోత్తమ్‌ మిశ్రా, భూపేంద్ర సింగ్‌, రాంపాల్‌ సింగ్‌ తదితర బీజేపీ సీనియర్‌ నాయకులు.. తమ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను హర్యానాలోని ఓ హోటల్‌కి బలవంతంగా తీసుకెళ్లారు’ అని జీతూ పట్వారీ ఆరోపించారు. ‘వాళ్లను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేశారు’ అని చెప్పారు. అయితే, కాంగ్రెస్‌ ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. ఇలాంటి ఆరోపణలు దురదృష్టకరమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ అన్నారు.


 తమ పార్టీ అలాంటి చర్యలకు పాల్పడలేదని, అది కాంగ్రెస్‌ అంతర్గత వివాదమని అన్నారు. మధ్యప్రదేశ్‌ సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన బీఎస్పీ ఎమ్మెల్యేను బీజేపీ నేతలు ఢిల్లీకి తీసుకెళ్లారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సోమవారం ఆరోపించారు. అయితే, రాజ్యసభ ఎన్నికల రేసులో తన పేరు ఉండేందుకే దిగ్విజయ్‌ ఇలాంటి సంచలన ఆరోపణలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎదురుదాడికి దిగింది. మరోవైపు, హర్యానా హోటల్‌లో ఉన్నట్టు చెబుతున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో నలుగురు కాంగ్రెస్‌, ఒకరు స్వతంత్రులు, మిగిలిన ముగ్గురు ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 114, బీజేపీకు 107 మంది ఎమ్మెల్యేలున్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కనీస మెజారిటీ 116 కాగా నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 


ముంగేరిలాల్‌ డ్రీమ్‌ 

రాష్ట్ర పరిస్థితులన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు తిరిగివస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటున్న బీజేపీ చర్యల్ని ‘ముంగేరిలాల్‌ కల’గా అభివర్ణించారు (ముంగేరిలాల్‌ అనేది ఓ హిందీ సీరియల్‌లోని పాత్ర పేరు. ఆ పాత్ర ఎప్పుడూ నెరవేరని పగటి కలలుకంటుంది). 


పదవులు, డబ్బుల ఆఫర్‌

మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని అందించిన డా. ఆనంద్‌ రాయ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో తాజాగా పోస్ట్‌ చేసిన ఓ వీడియో చర్చనీయాంశమైంది. కమల్‌నాథ్‌ సర్కార్‌ను కూలదోసే ప్రక్రియలో భాగంగా అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో బీజేపీ నేత నరోత్తమ్‌ మిశ్రా రూ 100 కోట్లకు బేరసారాలకు దిగుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తున్నది. అలాగే మంత్రి పదవులను కూడా సదరు ఎమ్మెల్యేలకు ఆయన ఆఫర్‌ చేసినట్టు వీడియో ద్వారా తెలుస్తున్నది. అయితే, ఆ వీడియో అబద్ధ్దమని, మిశ్రా ప్రతిష్టను దెబ్బతీసేందుకే దీన్ని సృష్టించారని బీజేపీ  ఆరోపించింది.


logo