శనివారం 29 ఫిబ్రవరి 2020
కాంగ్రెస్‌కు కరోనా

కాంగ్రెస్‌కు కరోనా

Feb 14, 2020 , 03:16:58
PRINT
కాంగ్రెస్‌కు కరోనా

కొచ్చి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా పరాజయం పాలవడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు ఢిల్లీ ఫలితాలు కరోనా వైరస్‌ లాంటి పెద్ద విపత్తు అని అభివర్ణించారు. పార్టీలో తిరిగి జవసత్వాలు నింపాలని.. లేకపోతే, రాబోయే పరిణామాల్ని అందరం కలిసి ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ పుస్తక వేడుకలో గురువారం పాల్గొన్న ఆయన ‘పీటీఐ’ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్‌ నాయకులు తమను తాము పునరుద్ధరించుకోవాలి. ప్రజలతో మమేకమవ్వాలంటే పార్టీ కూడా పునరుజ్జీవింపజేయాలి’ అని తెలిపారు. అలా జరుగకపోతే, ప్రజలకు దూరమవుతామని రమేశ్‌ హెచ్చరించారు. అధికారానికి దూరమై ఆరేండ్లు గడిచినప్పటికీ, పార్టీలోని కొందరు నేతలకు అహంకారం తగ్గలేదని, తామింకా మంత్రులమేనన్నట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ బలోపేతం కోసం.. స్థానిక నేతలకు నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛనివ్వాలని సూచించారు. కాగా పార్టీ పునరుద్ధరణకు ‘సర్జికల్‌ యాక్షన్‌' అవసరమని మరో కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీ ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే


logo