గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 13, 2020 , 17:09:50

ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ల సస్పెన్షన్ తొలగింపు

ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ల సస్పెన్షన్ తొలగింపు

జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌పై విధించిన  సస్పెన్షన్‌ను ఆ పార్టీ తొలగించింది. పార్టీలో చర్చల అనంతరం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేసినట్లు యువ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే గురువారం ట్విట్టర్‌లో తెలిపారు. సీఎం అశోక్ గెహ్లోట్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో వీరిద్దరి ప్రమేయం ఉన్నదని ఆరోపణలున్నాయి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌తో వీరిద్దరు డబ్బుల అంశంపై బేరసారాలాడినట్లు ఆడియో టేపుల ద్వారా బయటపడింది. సీఎం గెహ్లాట్‌కు ఎదురుతిరిగిన సచిన్ పైలట్‌కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయడంతోపాటు వారిద్దరిపై కేసులు కూడా నమోదు చేశారు.

కాగా రాహుల్, ప్రియాంక గాంధీలతో సచిన్ పైలట్ భేటీ అనంతరం రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగిపోయింది. సచిన్ తిరిగి పార్టీకి దగ్గర కావడంతో ఆయన విధేయులైన ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌ల సస్పెన్షన్‌ను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. రాజస్థాన్ అసెంబ్లీ సమావేశం శుక్రవారం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇది జరుగడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
logo