శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 13:27:55

పుదుచ్చేరి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాకౌట్

పుదుచ్చేరి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాకౌట్

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మాట్లాడుతుండగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. కరోనా నేపథ్యంలో వాయిదాపడిన బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీ ప్రారంభం సందర్భంగా ప్రసంగించాల్సిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ హాజరుకాలేదు. దీంతో ఏఐఏడీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేలు దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ సభ వాకౌట్ చేశారు. మరోవైపు ఆర్థిక శాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి నారాయణస్వామి సోమవారమే అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

కాగా, లెఫ్టినెంట్ గవర్నర్‌ కిరణ్ బేడీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించకపోవడం, ఆమె ఆమోదం లేకుండానే సీఎం నారాయణస్వామి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్ష అన్నాడీఎంకే మండిపడింది. ఈ నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వాన్ని రద్దు చేయడంతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్‌‌‌ను కేంద్రం తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు బుధవారం సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ శుక్రవారం అసెంబ్లీకి హాజరై ప్రసంగించారు. దీంతో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు.


logo