శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 13:54:58

సీఎం పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా

సీఎం పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా


భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా చేశారు. మరికాసేపట్లో గవర్నర్‌ లాల్జి టాండన్‌ను కమల్‌నాథ్‌ రాజ్‌భవన్‌లో కలవనున్నారు. గవర్నర్‌కు తన రాజీనామా లేఖను కమల్‌నాథ్‌ సమర్పించనున్నారు. అసెంబ్లీలో బలపరీక్ష కంటే ముందే కమల్‌నాథ్‌ సీఎం పదవికి రాజీనామా ప్రకటించారు. 

ప్రజాస్వామ్యాన్ని బీజేపీ హత్య చేసింది.. ప్రజలు క్షమించరు

భారతీయ జనతా పార్టీ రాజకీయాలపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తీవ్రంగా స్పందించారు. రాజీనామా ప్రకటన సందర్భంగా సీఎం కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మెజార్టీ స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి బీజేపీ తమకు వ్యతిరేకంగా పని చేసింది. మధ్యప్రదేశ్‌ ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసిందన్నారు. ప్రజా తీర్పును బీజేపీ అవమానించింది. బీజేపీ పాలనలో మాఫియా రాజ్యమేలుతోందన్నారు. మాఫియాకు వ్యతిరేకంగా పని చేయడం బీజేపీకి నచ్చలేదు అని కమల్‌ నాథ్‌ పేర్కొన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు రాష్ర్టానికి ద్రోహం చేశారు. తమ ఎమ్మెల్యేలను కర్ణాటకలో నిర్బంధించారు అని కమల్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

15 నెలల పాలనలో మధ్యప్రదేశ్‌ను అభివృద్ధి చేశాను. సమర్థవంతంగా ప్రజలకు పాలన అందించామని తెలిపారు. బీజేపీ 15 సంవత్సరాల్లో చేయలేనిది.. తాను 15 నెలల్లో చేసి చూపించాను అని స్పష్టం చేశారు. రైతులు తమపై ఎంతో విశ్వాసం ఉంచారు.  వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేశాం.. 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని కమల్‌నాథ్‌ పేర్కొన్నారు.


logo