మంగళవారం 31 మార్చి 2020
National - Mar 18, 2020 , 10:04:56

కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ అరెస్ట్‌

కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ అరెస్ట్‌

బెంగళూరు : మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు దిగ్విజయ్‌ సింగ్‌ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కర్ణాటక రాజధాని బెంగళూరులోని రమాడా హోటల్‌లో 22 మంది ఎమ్మెల్యేలు బస చేస్తున్నారు. అయితే ఈ 22 మంది అసంతృప్త ఎమ్మెల్యేలను కలిసేందుకు దిగ్విజయ్‌ సింగ్‌, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వెళ్లారు. కానీ దిగ్విజయ్‌ సింగ్‌, శివకుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. హోటల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దిగ్విజయ్‌, శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తుందని దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో.. సీఎం కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది. 

ప్రతి గది వద్ద పోలీసులే : దిగ్విజయ్‌

రమాడా హోటల్‌లో 22 మంది ఎమ్మెల్యేలు బస చేస్తున్నారని దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉన్న ప్రతి గది వద్ద పోలీసులను మోహరించారని, కనీసం వారికి కమ్యూనికేషన్‌ లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనతో ఐదుగురు ఎమ్మెల్యేలు మాట్లాడారని, వారంతా సొంత గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేల ఫోన్లను పోలీసులు లాక్కున్నారని దిగ్విజయ్‌ ఆరోపించారు. 24 గంటల పాటు ఎమ్మెల్యేలపై పోలీసులు నిఘా పెట్టారని పేర్కొన్నారు. 


logo
>>>>>>