శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 03:05:17

రాజస్థాన్‌ సర్కార్‌లో ముసలం

రాజస్థాన్‌ సర్కార్‌లో ముసలం

  • సీఎం గెహ్లాట్‌, డిఫ్యూటీ సచిన్‌ అమీతుమీ
  • ఎస్‌వోజీ నోటీస్‌తో తారస్థాయికి విబేధాలు
  • ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర: అశోక్‌ గెహ్లోట్‌
  • సీఎం అవమానిస్తున్నారన్న సచిన్‌ పైలట్‌
  • తన వర్గం ఎమ్మెల్యేలతో ఢిల్లీకి డిఫ్యూటీ సీఎం

న్యూఢిల్లీ, జూలై 12: రాజస్థాన్‌లో అశోక్‌గెహ్లాట్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముసలం తారస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌కు, డిఫ్యూటీ ముఖ్యమంత్రి, రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ మధ్య వర్గపోరుతో ప్రభుత్వం పతనం అంచున నిలిచింది. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతున్నదంటూ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ) పోలీసులు సీఎం, డిఫ్యూటీ సీఎంతోపాటు పలువురు ఎమ్మెల్యేలకు శుక్రవారం నోటీసులు ఇవ్వటంతో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తన గ్రూపు ఎమ్మెల్యేలతో సచిన్‌ పైలట్‌ ఢిల్లీ చేరగా, మద్దతుదారులతో సీఎం గెహ్లాట్‌ ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఢిల్లీ నుంచి రణ్‌దీప్‌ సుర్జేవాలా, అజయ్‌మాకెన్‌ను జైపూర్‌ పంపింది. సోమవారం కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరగనున్నది.

ఎస్‌వోజీ నోటీసులతో కలకలం

సచిన్‌ పైలట్‌కు, అశోక్‌గెహ్లాట్‌కు మధ్య కొంతకాలంగా విబేధాలు ఎక్కువయ్యాయి. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఆశచూపిందని గెహ్లాట్‌ ఆరోపించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతున్నదంటూ ఎస్‌ఓజీ పోలీసులు శుక్రవారం సీఎం, డిఫ్యూటీ సీఎం, ప్రభుత్వ చీఫ్‌ విప్‌తోపాటు ప్రభుత్వానికి మద్దతిస్తున్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేతలుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదుచేశారు. దాంతో బహిరంగంగా నోటీసులు జారీ చేయటాన్ని సచిన్‌ పైలట్‌ అవమానంగా భావించారని, ఇక గెహ్లాట్‌ నాయకత్వంలో పనిచేసే ప్రసక్తే లేదని సచిన్‌ అనుకూల వర్గం ప్రకటించింది. పైలట్‌ను పీసీసీ పదవినుంచి తొలగించేందుకు గెహ్లాట్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన వర్గం ఎమ్మెల్యేలతో సచిన్‌ పైలట్‌ ఆదివారం ఢిల్లీ వెళ్లారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఆయన సమావేశం కానున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ఇటీవలే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియాతో సచిన్‌పైలట్‌ ఢిల్లీలో సమావేశమైనట్టు సమాచారం. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో సచిన్‌పైలట్‌ను అణచివేస్తున్నారని సింధియా ట్వీట్‌చేశారు. పైలట్‌ వర్గంలోని 19మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ సమీపంలోని గురుగ్రాంలో ఉన్న ఐటీసీ గ్రాండ్‌ భారత్‌ రిసార్టులో క్యాంపు ఏర్పాటుచేసినట్టు తెలిసింది. కాగా, పలువులు మంత్రులు సహా సీఎం మద్దతుదారులు ఆయన నివాసంలో ఆదివారం గెహ్లోట్‌ను కలిశారు. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ రంగంలోకి దిగింది. సీఎం గెహ్లోట్‌తో పార్టీ పెద్దలు కేసీ వేణుగోపాల్‌, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి అవినాశ్‌పాండే చర్చలు జరిపినట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారన్న గెహ్లోట్‌ ఆరోపణలను బీజేపీ తిరస్కరించింది. ఆరోపణలు నిరూపించాలని లేదంటే రాజకీయాలనుంచి వైదొలగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌పూనియా డిమాండ్‌ చేసింది.

మధ్యప్రదేశ్‌ బాటలోనే..


రాజస్థాన్‌లో ప్రస్తుత పరిణామాలు మూడు నెలల క్రితం మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం యువ నేత జోతిరాధిత్య సింధియా తిరుగుబాటుతో కూలిపోయిన విధానాన్ని గుర్తుకు తెస్తున్నాయి.  లోక్‌సభ ఎన్నికలకు ముందు 2018 నవంబర్‌లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రావటంలో మధ్యప్రదేశ్‌లో సింధియా, రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌ కీలకపాత్ర పోషించారు. రెండు రాష్ర్టాల్లోనూ ఈ యువ నేతలే పార్టీని విజయపథంలో నడిపించారు. కానీ వారికి కాంగ్రెస్‌ అధిష్ఠానం షాకిస్తూ సీనియర్లు కమల్‌నాథ్‌, అశోక్‌గెహ్లాట్‌ను రెండు రాష్ర్టాలకు  ముఖ్యమంత్రులను చేసింది. దాంతో సీనియర్లు, యువనేతల మధ్య వర్గపోరు మొదలైంది. కమల్‌నాథ్‌తో తీవ్ర విబేధాలతో సింధియా తన మద్దుతుదారులతో బీజేపీలో చేరటంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం గత మార్చిలో కూలిపోయింది. బీజేపీ కుట్రతోనే తమ ప్రభుత్వం కూలిపోయిందని కమల్‌నాథ్‌ ఆరోపించారు. తాజాగా రాజస్థాన్‌లో కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

బీజేపీ రాజ‘తంత్రం’

తక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు

మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గోవాలో చేసింది ఇదే

ఇప్పుడు రాజస్థాన్‌లో అదే కథ పునరావృతం!

రాజస్థాన్‌లో బీజేపీ తన మార్కు రాజకీయ క్రీడను ప్రారంభించిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ క్రీడలో భాగంగానే అధికార కాంగ్రెస్‌లో అసంతృప్తులు తిరుగుబాటు జెండా ఎగురవేశారని విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంతకుముందు పలు రాష్ర్టాల్లో బీజేపీ అధికారాన్ని సాధించిన తీరును గుర్తు చేస్తున్నారు.   

  • మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు 2018 నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. బీజేపీకి 109, కాంగ్రెస్‌కు 114, మిగతా పార్టీలకు ఏడు స్థానాలు దక్కాయి. బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా కమల్‌నాథ్‌ ఎన్నికయ్యారు. అయితే కమల్‌నాథ్‌పై పీకల్లోతు కోపంతో ఉన్న కాంగ్రెస్‌ మరో నేత జ్యోతిరాదిత్యా సింధియాపై బీజేపీ గాలం వేయడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలింది. 
  • కర్ణాటకలోని 225 అసెంబ్లీ స్థానాలకు 2018 మేలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 105, కాంగెస్‌కు 78, జేడీఎస్‌కు 34 స్థానాలు దక్కాయి. సీఎంగా యెడియూరప్ప ప్రమాణం చేసిన మెజార్టీ సమీకరించలేక మూడ్రోజులకే దిగిపోయారు. అనంతరం కుమారస్వామి నేతృత్వంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ సర్కారు ఏర్పడింది. అయితే  14 నెలల తర్వాత కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీలో చేరడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. అరుణాచల్‌లో సైతం కాంగ్రెస్‌ నుంచి బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 2018లో మేఘాలయ, 2017లో గోవా, మణిపూర్‌ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. తక్కువ స్థానాలున్నా చిన్నచిన్న పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది.

జనం మెచ్చిన యువ నేత

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత రాజేశ్‌పైలట్‌ కుమారుడే సచిన్‌ పైలట్‌. సచిన్‌ ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో 1977 సెప్టెంబర్‌ 7న జన్మించారు. తండ్రి అకాల మరణంతో 26వ ఏటనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004లో రాజస్థాన్‌లోని దౌసా పార్లమెంటు స్థానంనుంచి గెలుపొందారు. 2009లో ఆజ్మీర్‌నుంచి పార్లమెంటుకు ఎన్నికై మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో పనిచేశారు. 2014లో అదే నియోజకవర్గంనుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లోనే రాజస్థాన్‌ పీసీసీ పగ్గాలు చేపట్టిన ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన బీజేపీని ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఆయనే సీఎం అవుతారని అందరూ భావించినప్పటికీ కాంగ్రెస్‌ అధిష్ఠానం అనూహ్యంగా గెహ్లోట్‌ను సీఎంగా ఎంపికచేసింది. సచిన్‌ను డిఫ్యూటీ సీఎంగా నియమించారు. 

మొత్తం స్థానాలు 200

కాంగ్రెస్‌+ 119

బీజేపీ + 75

మ్యాజిక్‌ ఫిగర్‌ 101 పైలట్‌ మద్దతుదారులు

25 మంది+ ముగ్గురు స్వతంత్రులు  

పైలట్‌ వర్గం బీజేపీకి మద్దతిస్తే ఆ పార్టీ బలం 103


logo