ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 17:15:38

‘కూటమి కోసం కాంగ్రెస్‌ పార్టీ తలొగ్గింది..’

‘కూటమి కోసం కాంగ్రెస్‌ పార్టీ తలొగ్గింది..’

పాట్నా: బీహార్‌లో మహాకూటమి కొనసాగడం కోసం కాంగ్రెస్‌ పార్టీ అన్నింటా తలొగ్గిందని ఆ పార్టీ ఇన్‌చార్జ్‌ శక్తిసిన్హా గోహిల్‌ తెలిపారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రాకపోవడడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. మహాకూటమి కొనసాగేందుకు కూటమిలోని పార్టీలు పేర్కొన్న అన్ని నిర్ణయాలకు కాంగ్రెస్‌ అంగీకరించిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా మహాకూటమిలోని పార్టీలు గత 30 ఏండ్లుగా గెలవని స్థానాల్లో పోటీకి కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను నిలిపిందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేసేవారిని ఆర్జేడీ గుర్తించాలని శక్తిసిన్హా సూచించారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో మహాకూటమిలోని పార్టీలతోపాటు బీహార్‌ కూడా నష్టపోవాల్సి వస్తుందన్నారు. 

మహాకూటమికి కాంగ్రెస్‌ ప్రతిబంధకంగా మారిందని వ్యాఖ్యలు చేసిన ఆర్జేడీ సీనియర్‌ నేత శివానంద్‌ తివారీపై శక్తిసిన్హా మండిపడ్డారు. శివానంద్‌ తివారీ ఇప్పటికే చాలా సార్లు చాలా పార్టీలు మారారని విమర్శించారు. శివానంద్‌ గతంలో జేడీయూ ఎంపీ అని, ఆ పార్టీ పట్ల ఆయన ఇప్పటికీ విధేయత ప్రదర్శించడం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. బలహీన జేడీయూ ప్రభుత్వానికి సహకరించేందుకే కాంగ్రెస్‌ పార్టీపై శివానంద్‌ తివారీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని శక్తిసిన్హా గోహిల్‌ మండిపడ్డారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి