శనివారం 28 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 14:54:55

మహాఘట్బం‌ధన్‌లో లుకలుకలు షురూ!

మహాఘట్బం‌ధన్‌లో లుకలుకలు షురూ!

పాట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం మహాఘట్బంధన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. రాహుల్‌, ప్రియాంకలు బిహార్‌లో ప్రచారం చేయకపోవడం వల్లనే మహా కూటమి ఓటమి పాలయ్యిందని ఆర్జేడీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని కాంగ్రెస్‌కు ఏ కోశానా లేదని తెలిసిపోయిందని, అయినా పొత్తు పెట్టుకోవడం వల్ల తప్పనిసరిగా వారిని గెలిపించుకున్నామని వారు కుండబద్దలు కొడుతున్నారు. ఆర్జీడీ జాతీయ ఉపాధ్యక్షుడైన శివానంద్‌ తివారీ ఏకంగా మీడియా సమావేశం పెట్టి రాహుల్‌, ప్రియాంకలపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ఎన్నికల ఫలితాలు వెలువడి ఇంకా వారం రోజులు కూడా పూర్తవకముందే ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 

సవాల్‌గా తీసుకున్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా సిమ్లాలోని తన ఇంట్లో ప్రియాంక వాద్రా ఉండగా.. రాహుల్ గాంధీ విహారయాత్ర చేశారని ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ ఆరోపించారు. బిహార్ ఎన్నికలను కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించినట్లు అనిపించలేదన్నారు. చాలా తక్కువ మంది నేతలు ప్రచారానికి వచ్చారని.. ఆ వచ్చిన నాయకులలో చాలా మంది పాట్నాలో మీడియా సమావేశాలకే పరిమితం అయ్యారని విమర్శించారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదన్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 70 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ కనీసం 70 బహిరంగ సభలు కూడా నిర్వహించలేకపోయిందని దుయ్యబట్టారు. రాహుల్‌ కేవలం నాలుగంటే నాలుగు సభలకు మొక్కుబడిగా హాజరయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఖరి కారణంగానే బీజేపీ లబ్ధి పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నదని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఒక్క బిహార్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగినా వారు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదన్నారు. దేశంలోనే అతి పెద్ద, పురాతన పార్టీ అని చెప్పుకునే వారు ఎన్నికల విషయంలో తీవ్రంగా ఆలోచించాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.