శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 08, 2020 , 14:53:29

కంప్యూటర్ బాబా ఆశ్రమం కూల్చివేత

కంప్యూటర్ బాబా ఆశ్రమం కూల్చివేత

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని కంప్యూటర్ బాబా ఆశ్రమాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ఆశ్రమాన్ని చట్టవిరుద్ధంగా నిర్మించారన్న ఆరోపణలపై కూల్చివేశారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఆందోళనకు దిగిన బాబాతోపాటు మరో ఆరుగురు మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలువనందునే ప్రభుత్వం కక్షసాధింపు చర్యగా ఈ పనికి పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది.

ఇండోర్‌ జిల్లా జంబుడి హప్సీ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో మాజీ మంత్రి అయిన నామ్‌దేవ్‌ త్యాగీ ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఆక్రమణలను తొలగించడానికి బాబాకు అధికారులు నోటీసు కూడా జారీ చేశారు. ప్రభుత్వ భూమి నుంచి ఖాళీ చేయటానికి ఆర్డర్ కూడా జారీ చేయబడింది. అయినప్పటికీ ఆశ్రమాన్ని నిర్మించి 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించాడని ఆరోపణలు ఉన్నాయి. ఆశ్రమాన్ని ఖాళీ చేసి భూమిని ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో.. అధికారులు ఆశ్రమాన్ని కూల్చివేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా బాబాతో పాటు పలువురు నిరసనలకు దిగారు. దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ అజయ్‌దేవ్‌ శర్మ తెలిపారు.

2018 లో నామ్‌దేవ్ త్యాగి అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టారు. కంప్యూటర్ బాబాను చౌహాన్ మంత్రివర్గంలో రాష్ట్ర హోదా మంత్రితో చేర్చుకున్నారు. అయితే, 2018 లో ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని విడిచిపెట్టి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. కంప్యూటర్ బాబా, యోగేంద్ర మహాంత్‌తో పాటు భైయుజీ మహారాజ్, స్వామి హరిహరానంద్జీ సరస్వతి, నర్మదానంద్జీలకు బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర మంత్రి హోదాను ఇచ్చింది. కాగా, ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలువడం వల్లనే శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం ఆయన ఆశ్రమాన్ని కూల్చివేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. పదునైన జ్ఞాపకశక్తి, ల్యాప్‌టాప్‌తో పాటు గాడ్జెట్‌లపై అతనికున్న ప్రేమ కారణంగా ఈయనకు కంప్యూటర్‌ బాబా అని పేరు వచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ టికెట్‌పై పోటీ చేయాలనుకున్నారు. కాగా, చివరినిమిషంలో వేరే వారికి దక్కడంతో రాజకీయాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.