ప్రతి మనిషిలో ఏదో ఒక కళ తప్పకుండా ఉంటుంది. దాన్ని గుర్తించి సరైన మార్గంలో ఉపయోగిస్తే ప్రియా శ్రీకుమార్లా ఫేమస్ అవ్వొచ్చు. చేతినిండా సంపాదించొచ్చు.
కేరళకు చెందిన ప్రియా శ్రీకుమార్‌కు ఎంబ్రాయిడరీ వర్క్స్ అంటే చాలా ఇష్టం. ఏదైనా వస్తువునో, బొమ్మనో, అందమైన వారినో చూస్తే చాలు, జిరాక్స్ తీసినంత ఈజీగా ఆ రూపాన్ని ఎంబ్రాయిడరీ చేయగల ప్రతిభ అమెది. కేరళలోని పాళాలో ఇంజినీరింగ్ చేసే రోజుల్లో ఏదో హాబీగా మొదలు పెట్టిన పనే ఇప్పుడు గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆమె వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరు కాయల్లా’ సాగుతున్నది. మొదట్లో ఎంబ్రాయిడరీ చేసిన వాటిని తన స్నేహితురాళ్లకు, బంధువులకు బహుమతిగా ఇచ్చేది. ఆ పనితనం మెచ్చిన కొందరు తమకు కావాల్సిన విధంగా, పలు డిజైన్లలో వర్క్స్ చేయించుకునేవారు. ఎంతో కొంత డబ్బు ముట్ట జెప్పేవారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఖాళీ సమయం దొరికింది. దానిని సద్వినియోగం చేసుకొని ఎంబ్రాయిడరీకి కొంచెం భిన్నంగా తన కళను విస్తరించింది. అలా, 2019 లో సోషల్ మీడియా వేదికగా వ్యాపారం ప్రారంభించింది. కీ చైన్స్నుంచి పుస్తకాల వరకూ, షర్ట్స్, టీ-షర్ట్స్, జాకెట్స్, జీన్స్, చీరెలు, బ్యాగ్‌లు, బూట్లు.. కాదేది కళకు అనర్హం అన్నట్లు ఏదైనా తన త్రెడ్ వర్క్‌తో మరింత అందంగా కనిపిస్తుంది. వినియోగదారులకు ఇష్టమైన వస్తువులు, బొమ్మలకు దారంతో ప్రాణం పోస్తున్నది ప్రియా శ్రీకుమార్. ట్రెండ్‌కు తగ్గట్లుగా తన కళను మార్చుకుంటూ, విస్తరించుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నది ప్రియా.