ఆదివారం 05 జూలై 2020
National - Apr 20, 2020 , 13:10:11

ఇక్కడ లాక్‌డౌన్‌ మినహాయింపులు వర్తించవు..

ఇక్కడ లాక్‌డౌన్‌ మినహాయింపులు వర్తించవు..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 20 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపునిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే తమ రాష్ర్టాల్లో వైరస్‌ ప్రభావం తగ్గలేదని, సడలింపులు ఇస్తే పరిస్థితులు మరింత దిగజారుతాయని, కేంద్ర ప్రకటించిన నిబంధనల సడలింపులు తమ పరిధిలో వర్తించవని ఆయా రాష్ర్టాలు ప్రకటించాయి. ఇలా ప్రకటించిన రాష్ర్టాల్లో ఢిల్లీ, పంజాబ్‌, తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. 

ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాలు హాట్‌స్పాట్‌ పరిధిలో ఉన్నాయని, దేశరాజధానిలో కరోనా కేసులు పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌కు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడంలేదని సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. వారం రోజుల తర్వాత పరిస్థితులను సమీక్షిస్తామని, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రస్తుతం 77 ప్రాంతాల్లో కరోనా కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. 

పంజాబ్‌లో మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, ఎలాంటి మినహాయింపులు లేవని సీఎం అమరిందర్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. గోధుమల సేకరణకు మాత్రం అనుమతి ఇచ్చింది. 

కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ మినహాయింపులు తమ రాష్ట్రంలో పనిచేయవని, లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తున్నామని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని నిలువరించడానికి ఇకమీదట లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామని వెల్లడించారు. 

కేంద్రం చెప్పినట్లు ఎంపిక చేసిన ప్రాంతాల్లో కూడా ఏప్రిల్‌ 22 వరకు ఎలాంటి లాక్‌డౌన్‌ మినహాయింపులు లేవని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించే అవకాశం ఉందని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తున్నది. 

కరోనా వైరస్‌ లేని ప్రాంతాల్లో మాత్రమే లాక్‌డౌన్‌ మినహాయింపులు అమలు చేయాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇండోర్‌, భోపాల్‌, ఉజ్జయిన్‌ వంటి హాట్‌స్టా ఏరియాలు ఉన్నాయి. 

దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో కొన్ని వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించింది.


logo