e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home జాతీయం ప్రజలా? కంపెనీలా?

ప్రజలా? కంపెనీలా?

ప్రజలా? కంపెనీలా?
  • రోగుల ప్రాణాల కంటే కంపెనీల ప్రయోజనాలే ఎక్కువయ్యాయా?
  • మీ ప్రవర్తన నెగెటివ్‌గా ఉన్నది.. ఈ సమస్య చిన్నది కానే కాదు
  • ‘పనిచేయని వెంటిలేటర్ల’ కేసులో కేంద్రంపై బాంబే హైకోర్టు ఆగ్రహం
  • రోగుల పట్ల ఆందోళన ఉన్నట్టు కనిపించడంలేదని వ్యాఖ్య
  • కంపెనీని రక్షించేందుకే అఫిడవిట్‌ వేశారా అంటూ నిలదీత

ముంబై, మే 28: కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ తదితర అంశాల్లో విఫలమయ్యారంటూ అంతర్జాతీయ సంస్థలు, వైద్య పత్రికలు దుమ్మెత్తి పోసినా కేంద్రప్రభుత్వం వైఖరి మారడంలేదు. తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ రోగుల చికిత్స కోసం పనిచేయని వెంటిలేటర్లను పంపి కేంద్రం మళ్లీ అబాసుపాలైంది. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో న్యాయస్థానం చేత అక్షింతలు వేయించుకున్నది. మహారాష్ట్రలో మరాఠ్వాడా ప్రాంతంలోని దవాఖానలకు పనిచేయని 113 వెంటిలేటర్లను పంపడాన్ని తప్పుపడుతూ బాంబే హైకోర్టు (ఔరంగాబాద్‌ బెంచ్‌) కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. ప్రజల ప్రాణాల కంటే కంపెనీల ప్రయోజనాలను కాపాడటమే కేంద్ర ఆరోగ్యశాఖకు ముఖ్యంగా కనిపిస్తున్నట్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

వాళ్లు మంచివాటినే పంపారు!
కరోనా చికిత్సకు మరాఠ్వాడా ప్రాంతంలోని పలు ప్రైవేట్‌, ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందుతున్న బ్లాక్‌ ఫంగస్‌ రోగుల కోసం వెంటిలేటర్లు పంపాలని అక్కడి అధికారులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో గతవారం ‘పీఎం కేర్స్‌ ఫండ్‌’ నుంచి 150 వెంటిలేటర్లను కేంద్రం పంపించింది. ఇందులో 113 వెంటిలేటర్లు పనిచేయడం లేదని, మిగతా 37 వెంటిలేటర్‌ బాక్సులను తెరువలేదని పేర్కొంటూ ఔరంగాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానల డీన్‌లు, ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలు బాంబే హైకోర్టు (ఔరంగాబాద్‌ బెంచ్‌)ను ఆశ్రయించారు. దీనికి శుక్రవారం కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. వెంటిలేటర్లను గుజరాత్‌కు చెందిన జ్యోతి సీఎస్‌సీ అనే కంపెనీ తయారు చేసిందని, అయితే, ఇవే రకం వెంటిలేటర్లను ఇతర రాష్ర్టాలకు కూడా ఆ కంపెనీ పంపిందని, అవి సరిగ్గానే పనిచేస్తున్నాయని తెలిపింది . ‘దవాఖాన సిబ్బందికి వెంటిలేటర్ల వాడకంపై సరైన శిక్షణ లేనట్టుంది’ అని సందేహం వ్యక్తం చేసింది.

మనసారా సాయపడండి
కేంద్రం స్పందనపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘దేశ ప్రజలకంటే ఆ కంపెనీ ప్రయోజనాలే మీకు (కేంద్రం) ఎక్కువ అనిపిస్తున్నది. అయినా దవాఖాన వైద్యులు లేవనెత్తిన సమస్యను పట్టించుకోకుండా, కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన సమాధానాన్ని ఎలా అంగీకరించారు? వైద్యులు చెప్పిన సమస్యను నిర్ధారించడానికి ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? మీరు సమర్పించిన అఫిడవిట్‌ను చూస్తే, రోగుల ప్రాణాల గురించి ఆందోళన చెందుతున్నట్టు కనిపించడం లేదు. మీ ప్రవర్తన నెగెటివ్‌గా ఉన్నది. మీరు ఈ సమస్యను చాలా చిన్నదిగా భావిస్తున్నారు. అయితే, ఈ సమస్య చిన్నది కాదు. ఈ విషయంలో మేము కండ్లు మూసుకొని కూర్చోలేం’ అని ధర్మాసనం కేంద్రం వైఖరిని తూర్పారబట్టింది. ఔరంగాబాద్‌లోని దవాఖాన సిబ్బందికి వెంటిలేటర్ల వినియోగం తెలియదన్న వాదనను ఎంతమాత్రం అంగీకరించబోమని కోర్టు వెల్లడించింది. దవాఖాన సిబ్బందిని నిందిస్తూ .. బ్లేమ్‌ గేమ్‌ ఆడటం మానివేయాలని కేంద్రానికి హితవు పలికింది. రోగుల చికిత్సకు వెంటిలేటర్లు సాయపడేలా మనసారా కృషిచేయాలన్నది. కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నది. దీంతో కోర్టు కేసును జూన్‌ 2కు వాయిదా వేసింది.

మోదీకి కరోనా విపత్తు అర్థం కాలేదు
అందువల్లే సెకండ్‌ వేవ్‌: రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ, మే 28: కరోనా రెండో వేవ్‌కు ప్రధాని మోదీనే కారణమని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కొవిడ్‌ ఉద్ధృతిని ఆయన సరిగా అర్థం చేసుకోలేదని, వ్యాక్సిన్‌ వ్యూహాన్ని కేంద్రం సరిగా అమలు చేయకుంటే దేశంలో మరిన్ని వేవ్‌లు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ప్రధాని మోదీ ఈవెంట్‌ మేనేజర్‌గా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు దేశంలో 3 శాతం మందికే వ్యాక్సిన్‌ వేశారని, ఇది ఇలాగే కొనసాగితే దేశ ప్రజలందరికీ టీకా ఇవ్వాలంటే మూడేళ్లు సమయం పడుతుందని తెలిపారు. యాభై శాతం మందికి వ్యాక్సిన్‌ వేయిస్తే దేశంలో మరిన్ని వేవ్‌లు రాకుండా అడ్డుకోవచ్చునని రాహుల్‌ సూచించారు.

డిసెంబరుకల్లా అందరికీ వ్యాక్సిన్‌: జవదేకర్‌
న్యూఢిల్లీ, మే 28: ఈ ఏడాది డిసెంబరుకల్లా దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ తెలిపారు. ‘డిసెంబరులోపు దేశంలో 216 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి జరుగుతుందని ఆరోగ్య శాఖ ఇప్పటికే తెలిపింది. అంటే 108 కోట్ల మందికి (ఒక్కొక్కరికి రెండు డోసులు) వ్యాక్సిన్‌ లభిస్తుంది. కేంద్రంపై విమర్శలు చేస్తున్న రాహుల్‌ గాంధీ ఈ సంగతిని అర్థం చేసుకోవాల’ని శుక్రవారం విలేకరుల సమావేశంలో జావదేకర్‌ వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటి వరకు 20 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను వేశారని, సంఖ్యాపరంగా భారత్‌ అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉందని చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రజలా? కంపెనీలా?

ట్రెండింగ్‌

Advertisement