సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 25, 2020 , 17:55:00

మయన్మార్ సరిహద్దు గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ ప్రారంభం

 మయన్మార్ సరిహద్దు గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ ప్రారంభం

మయన్మార్: మణిపూర్ లో భారత్, మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) పథకం కింద నీటి సరఫరా ప్రారంభమైంది. సరిహద్దుకు సమీపంలోని రెండు గ్రామాల్లో జలజీవన్ మిషన్ కింద చేపట్టిన రెండు నీటి ప్రాజెక్టులను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ప్రాంభించారు. ఈ రెండు గ్రామాలు జిల్లా కేంద్రానికి దూరంగా మారుమూలన ఉండటమేకాక, ఒకప్పుడు తిరుగుబాటుదార్ల ప్రాబల్యంలో ఉన్న ప్రాంతాలు. ఇపుడు ఈ రెండు గ్రామాలకు జలజీవన్ మిషన్ కింద క్రమం తప్పకుండా మంచినీరు సరఫరా అవుతోంది.

ఆశావహ జిల్లాల్లో ఒకటైన చందేల్ జిల్లాలోని ఖెంగ్జోయ్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఖాంగ్ బరోల్ గ్రామానికి ఇపుడు జలజీవన్ మిషన్ ద్వారా మంచినీరు అందుతోంది. జిల్లా కేంద్రానికి 69కిలోమీటర్ల దూరంలో, మయన్మార్ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం ఉంది. ఈ ఊర్లో 82 ఇళ్లు ఉన్నాయి. 2041వ సంవత్సరానికల్లా ఈ గ్రామం జనాభా దాదాపు వెయ్యికి చేరుకుంటుందన్న అంచనాతో ఈ గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థను రూపొందించారు. రూ. 60లక్షల రూపాయల అంచనా వ్యయంతో 82ఇళ్లకు, దాదాపు 450మంది జనాభాకు భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ఆధారంగా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నీటి శుద్ధీకరణ ప్లాంటుకు 6కిలోమీటర్ల దూరంలోని "ఖాంగ్బరోల్లోక్" అనే నీటి వనరునుంచి నీటిని తీసుకుంటున్నారు.

నీటి శుద్ధీకరణ ప్లాంట్ కంటే నీటి వనరు బాగా ఎగువన ఉన్నందున గ్రావిటీ ఆధారంగా నీటి సరఫరా వ్యవస్థను చేపట్టారు. చందేల్ జిల్లా, ఖెంగ్జోయ్ సబ్ డివిజన్ పరిధిలోని ఖెంగ్జోయ్ అనే మరో మారుమూల గ్రామానికి కూడా  జలజీవన్ మిషన్ కింద నీటిసరఫరా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో, భారత్-మయన్మార్ సరిహద్దుకు 20కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ ఊరిలోని 73 ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీరందుతోంది. జలజీవన్ మిషన్ మార్గదర్శక సూత్రాల ప్రకారం గ్రామ నీటిసరఫరా, పారిశుద్ధ్య కమిటీ ఈ వ్యవస్థను నిర్వహిస్తూ వస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.