బుధవారం 08 జూలై 2020
National - Jun 16, 2020 , 17:39:12

భారత్‌-చైనా మధ్య ఘర్షణ.. తెలంగాణ కల్నల్‌ మృతి

భారత్‌-చైనా మధ్య ఘర్షణ.. తెలంగాణ కల్నల్‌ మృతి

హైద‌రాబాద్‌: ల‌డ‌ఖ్‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన గొడ‌వ‌లో భార‌తీయ క‌ల్న‌ల్ ఒక‌రు మృతిచెందారు. వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు(37) తెలంగాణ రాష్ర్టానికి చెందిన సూర్యాపేట వాసి.  రెండు దేశాలకు చెందిన సైనికుల ఘ‌ర్ష‌ణ‌లో.. భార‌త సైన్యంలోని ముగ్గురు జ‌వాన్లు చ‌నిపోయారు. దీంతో గాల్వ‌న్ వ్యాలీలో ఉద్రిక్త ప‌రిస్థితులు మ‌రింత జ‌ఠిలం అయ్యాయి. బుల్లెట్ ఫైరింగ్ లేకుండా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లోనే ఇరు దేశాల‌కు చెందిన సైనికులు మృత్యువాత‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. సూర్యాపేట‌కు చెందిన క‌ల్న‌ల్ సంతోష్‌బాబు ఆ ఘ‌ర్ష‌ణ‌ల్లో చ‌నిపోయిన‌ట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులు భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.  క‌ల్న‌ల్ సంతోష్‌.. ల‌డ‌ఖ్‌లోని ఇన్‌ఫాంట్రీ ద‌ళానికి క‌మాండింగ్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఏడాదిన్నరగా చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు.

సోమ‌వారం రాత్రి గాల్వ‌న్ లోయ‌లో రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. అయితే ఈ ఘ‌ట‌న ఎంతో క‌లిచివేసింద‌ని మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ ట్వీట్ చేశారు.  చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మాజీ సైనికాధికారులు ఆరోపిస్తున్నారు.  చైనా మాత్రం భార‌త వైఖ‌రిని ఖండిస్తున్న‌ది.  భార‌త బ‌ల‌గాలు త‌మ స‌రిహ‌ద్దు దాటి వ‌చ్చిన‌ట్లు ఆ దేశం పేర్కొన్న‌ది. 1975 త‌ర్వాత తొలిసారి రెండు దేశాల మ‌ధ్య వివాదం హింసాత్మ‌కంగా మారింది. 

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం

కల్నల్‌ బిక్కమల్ల సంతోష్‌బాబు 6వ తరగతి నుంచి విజయనగరం కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో, ఆ తర్వాత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో, అనంతరం ఇండియన్‌ మిలటరీ అకాడమీలో విద్యనభ్యసించాడు. విద్యాభ్యాసం అనంతరం ఆర్మీలో ఉద్యోగం. మొత్తం 15 సంవత్సరాల సర్వీసు. సర్వీస్‌ మొత్తం కశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, లఢక్‌లో, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పనిచేశాడు. 37 సంవత్సరాల వయస్సులోనే కల్నల్‌గా పదోన్నతి పొందాడు. ఇది రికార్డు ఘనత. సంతోష్‌బాబుకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(8), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌ బెటాలియన్‌ రావాల్సి ఉన్న సంతోష్‌ గాల్వన్‌కు రావాల్సిన బెటాలియన్‌ ఆలస్యం వల్ల అక్కడే విధుల్లో ఉండిపోయాడు. 

సైన్యంలో పనిచేసేవారు ధన్యజీవులు : కల్నల్‌ తల్లిదండ్రులు

సైన్యంలో పనిచేసేవారు ధన్యజీవులని వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు తల్లిదండ్రులు అన్నారు. కొడుకు మృతిపై వారు స్పందిస్తూ... నెల రోజుల్లో హైదరాబాద్‌కు వస్తానని చెప్పినట్లు తెలిపారు. సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తతంగా ఉందన్నారు. కుప్వారా జిల్లాలో కూడా సమర్థంగా విధులు నిర్వర్తించినట్లు చెప్పారు. చాలా చిన్న వయసులోనే కల్నల్‌ స్థాయికి ఎదిగాడన్నారు. డిపార్ట్‌మెంట్‌ విషయాలు ఎప్పుడూ కుటుంబంతో చెప్పేవాడు కాదు అన్నారు. విధుల్లో భాగంగా తనకేం జరిగినా ధైర్యంగా ఉండాలని తమతో చెప్పేవాడన్నారు. తల్లిగా బాధగా ఉన్నా దేశ పౌరురాలిగా గర్వంగా ఉందని సంతోష్‌ తల్లి పేర్కొనగా.. సైన్యంలో పనిచేసేవారు ధన్యజీవులని సంతోష్‌ తండ్రి అన్నారు. సంతానం ఒక్కరున్నా.. ఎంతమంది ఉన్నా సైన్యంలో ధైర్యంగా చేర్చవచ్చన్నారు.logo