శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 16:42:19

నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన లెక్చరర్‌పై కేసు

నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన లెక్చరర్‌పై కేసు

ముంబై : ఉద్యోగ నియామక సమయంలో నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన ఓ లెక్చరర్‌పై కేసు నమోదైంది. ఈ సంఘటన ముంబై సబర్బన్‌లోని మహిమ్‌లోని ఓ కళాశాలలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాసాయిలో ఉంటున్న మనీష్‌ ఖోబ్రగాడే 14 ఏండ్ల కిందట సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో తన బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (బీఈ) కోర్సు ఒరిజినల్ మార్కుల షీట్లను వెరిఫికేషన్ కోసం సమర్పించమని ఇనిస్టిట్యూట్‌ అధికారులు కోరారు. ఖోబ్రగడే ఈ ఏడాది జనవరి వరకు సర్టిఫికెట్లు ఇవ్వలేకపోయాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. 2006లో ఇనిస్టిట్యూట్‌లో లెక్చరర్‌గా చేరిన ఆయన స్వామి రామానంద్‌ తీర్థ్‌, మరాఠ్వాడ విశ్వవిద్యాలయం మార్కుల షీట్లను సమర్పించాడు. ఆయన 2002 ఆగస్టులో తన బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యాసంస్థ పలు సందర్భాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్కుల షీట్లను సమర్పించాలని కోరింది. అయితే ఖోబ్రగడే వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలను చెప్పి సర్టిఫికెట్లు సమర్పించడంలో ఆలస్యంగా చేశాడని అధికారి పేర్కొన్నారు. ‘ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు.. నిందితుడిపై మోసం, ఫోర్జరీ కేసు నమోదు చేశాం’ అని మహిమ్‌ పోలీస్‌స్టేషన్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ మిలింద్‌ గాడంకుష్‌ తెలిపారు. లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo