కక్ష్యలోకి సీఎంఎస్01 శాటిలైట్..

హైదరాబాద్: సీఎంఎస్-01 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఇవాళ ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఏపీలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీసీ 50 రాకెట్ ద్వారా సీఎంఎస్-01 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నాలుగవ దశ తర్వాత విజయవంతంగా రాకెట్ నుంచి సీఎంఎస్ ఉపగ్రహం వేరుపడింది. భారత్‌కు ఇది 42వ కమ్యూనికేషన్ శాటిలైట్. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నెట్ కనెక్టివిటీలో ఈ ఉపగ్రహం ఉపయోగపడనున్నది. కోవిడ్ మహమ్మారి వేళ .. ఇస్రో నిర్వహించిన రెండవ ప్రయోగం ఇది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌కు ఇది 52వ మిషన్. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ 3.41 నిమిషాలకు నింగికి ఎగిరింది. సీ-బ్యాండ్ సేవలను సీఎంఎస్-01 కల్పించనున్నారు. భారత్‌తో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవులకు సీ బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ముందుగా నిర్దేశించుకున్న కక్ష్యలోని సీఎంఎస్ శాటిలైట్‌ను పీఎస్ఎల్వీ రాకెట్ ఇంజెక్ట్ చేసినట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ తెలిపారు. శాటిలైట్ పనితీరు బాగుందని, మరో 4 రోజుల్లో ప్రత్యేక స్టాట్లోకి వెళ్తుందన్నారు. కోవిడ్ మహమ్మారి వేళ ఇస్రో సిబ్బంది ఎంతో మెరుగ్గా, సురక్షితంగా పనిచేశారని శివన్ తెలిపారు.