గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 17:30:28

రామ మందిర్‌ భూమిపూజ‌కు ఆతిథ్యమివ్వనున్న సీఎం యోగి

రామ మందిర్‌ భూమిపూజ‌కు ఆతిథ్యమివ్వనున్న సీఎం యోగి

లక్నో : అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయానికి చెందిన భూమిపూజ‌కు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఆగస్టు 5న జరుగబోయే భూమి పూజ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే సీఎం యోగి తప్ప ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినీ ఈ కార్యక్రమానికి పిలువడం లేదని శ్రీ రామ్ జన్మభూమి తీర్త్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చాంపత్ రాయ్ తెలిపారు. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత అందరినీ పిలుస్తామని చంపత్ రాయ్ చెప్పారు. భూమి పూజల సమయంలో ముఖ్యమంత్రి సమావేశం జరుగదని, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పూజ‌లో ఇతర అతిథులు పాల్గొంటారని రాయ్‌ తెలిపారు. 

భూమిపూజ‌కు రెండు రోజుల ముందు దేవాలయాల్లో రామాయణం, హనుమాన్ చలీసా పారాయణం, శ్లోకాలు, కీర్తనలు చేయాలని పూజారులు, సాధువులకు ట్రస్టు సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 5 సాయంత్రం ప్రజలు తమ ఇళ్ల వెలుపల దీపాలను వెలిగించాలని సూచించారు. ఆగస్టు 5న ప్రధాని హెలికాప్టర్ అయోధ్యలోని సాకేత్ కాలేజీలో అడుగుపెట్టనుంది. రాత్రి 11:30 గంటలకు అయోధ్యలోని రామ్ ఆలయ ప్రాంగణాన్ని ప్రధాని సందర్శిస్తారు. భూమిపూజ కార్యక్రమం సుమారు గంట పాటు జరుగనుంది.

ఈ కార్యక్రమానికి 50 మందికి ఒక బ్లాకు చొప్పున మొత్తం 4 బ్లాకుల్లో 200 మంది హాజరు కానున్నారు. దేశంలోని 50 మంది గొప్ప సాధువులు హాజరు కానున్నారు. 50 మంది సంఖ్యలో నాయకులు, ఉద్యమంతో సంబంధమున్న వ్యక్తులు ఉంటారు. వారిలో ఎల్‌కే అద్వానీతో పాటు మురళి మనోహర్ జోషి, ఉమా భారతి, కల్యాణ్ సింగ్, సాధ్వీ రితంభర, వినయ్ కటియార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. logo