సోమవారం 30 మార్చి 2020
National - Feb 22, 2020 , 11:46:36

ట్రంప్‌కు రాష్ట్రపతి విందు.. కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం

ట్రంప్‌కు రాష్ట్రపతి విందు.. కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం

హైదరాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు అహ్మదాబాద్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే 25వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. గౌరవార్థం విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు అరుదైన అవకాశం లభించింది. ట్రంప్‌కు గౌరవార్థం ఇచ్చే విందులో పాల్గొనాలని రాష్ట్రపతి భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ప్రధాని మోదీతో సహా కొద్దిమంది కేంద్రమంత్రులు, కొన్ని రాష్ర్టాల సీఎంలకు మాత్రమే ఆహ్వానం అందింది. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం అందిన రాష్ర్టాలు.. అసోం, హర్యానా, కర్ణాటక, బీహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ మాత్రమే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ 25వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ 25వ తేదీ మధ్యాహ్నం ట్రంప్‌కు లంచ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్రపతి భవన్‌లో విందు కార్యక్రమం ముగిశాక.. రాత్రి 10 గంటల సమయంలో అమెరికాకు బయల్దేరనున్నారు ట్రంప్‌. 


logo