బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 08:34:08

ఎన్పీఆర్‌ వాయిదా

ఎన్పీఆర్‌ వాయిదా
  • కేసీఆర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • అసెంబ్లీ సమావేశాల తర్వాతే ఖరారు
  • సవరించిన ఫార్మాట్‌పై అభ్యంతరాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌) ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్పీఆర్‌ విషయంలో పలు వర్గాల్లో సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్‌ ఈ కీలక నిర్ణయం తీసుకొన్నది. దేశంలో ప్రతి పదేండ్లకొకసారి జనగణన చేపడుతారు. ఈసారి 2020-21లో జనగణన జరుగాల్సి ఉన్నది. అలాగే ప్రతి ఐదేండ్లకోసారి ఎన్పీఆర్‌ సవరణ జరుగుతుంది. జనగణనకు సన్నాహకంగా హౌస్‌హోల్డ్‌ సర్వే నిర్వహిస్తారు. దాంతోపాటే ఎన్పీఆర్‌ వివరాలను సేకరించాల్సిందిగా కేంద్రం రాష్ర్టాలకు సూచించింది. అయితే గతంలో ఉన్న ఎన్పీఆర్‌ ఫార్మాట్‌ను సవరించి మరికొన్ని ప్రశ్నలను జోడించింది. జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) తయారీకి ఎన్పీఆర్‌ ప్రాతిపదికగా భావిస్తున్న నేపథ్యంలో కొత్త ప్రశ్నల జోడింపు తీవ్ర వివాదాస్పదమైంది. 

ఎన్పీఆర్‌ ఉద్దేశం ఇదీ..

జనాభా లెక్కల చట్టం ప్రకారం జనగణన నిర్వహిస్తారు. దేశంలో జనసంఖ్యను కనుక్కోవటం దీని ప్రధాన ఉద్దేశం. అట్లాగే పౌరసత్వ చట్టం -1955, పౌరసత్వ నియమాలు-2003 కింద ఎన్పీఆర్‌ చేపడతారు. ఒక నివాసిత ప్రాంతంలో గత ఆరునెలలుగా నివసిస్తున్న, లేదా వచ్చే ఆరునెలలు నివసించాలనుకొంటున్న వ్యక్తుల వివరాలను సేకరించడం ఎన్పీఆర్‌ ప్రధాన ఉద్దేశం. జనగణన అయినా.. ఎన్పీఆర్‌ అయినా చట్టంలోని ఫలానా సెక్షన్‌ కింద నిర్వహించాలని కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంటుంది. 

సవరించిన నమూనాతో ఎన్పీఆర్‌ 

వివరాలను సేకరించాల్సిందిగా రాష్ర్టాలకు సూచించిన కేంద్రం.. ఆ ప్రశ్నలను  చట్టంలోని ఏ సెక్షన్‌ ప్రకారం చేర్చిందో మాత్రం స్పష్టతనివ్వలేదు. ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ).. వివాదాస్పదమైన నేపథ్యంలో తాజాగా ఎన్పీఆర్‌పై  కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కూడా వివాదాస్పదమవుతున్నది. దీంతో ప్రస్తుతానికి దీని అమలును పక్కనపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఎన్పీఆర్‌ విషయంలో కూడా తాజాగా సవరించిన ఫార్మాట్‌తో కాకుండా పాత నమూనానే ప్రాతిపదికగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య ఆర్నెళ్ల వ్యవధిలో ఏదో ఒక  45 రోజుల కాలపరిమితిలో ఎన్పీఆర్‌, జనగణన ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. 

పలు రాష్ర్టాలు ఏప్రిల్‌ ఒకటి నుంచి ఈ ప్రక్రియను అమలుచేయనున్నాయి. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని వాయిదా వేసింది. ప్రక్రియ పూర్తికి చాలా సమయం ఉన్నందున ప్రస్తుతానికి ఎన్పీఆర్‌ను వాయిదా వేసి, పరిస్థితులమేరకు తర్వాత ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కలెక్టర్లకు శిక్షణ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసినట్లు తెలిసింది. రాష్ట్రమంతటా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్నది. ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి.

ఇవన్నీ పూర్తయిన తర్వాతే ఎన్పీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ర్టాలు ఎన్పీఆర్‌ ప్రక్రియను పెండింగ్‌లో పెడుతున్నట్లు ప్రకటించాయి. వాటితోపాటు ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లను వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర రాష్ర్టాలతో సంప్రదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నది. ఎన్పీఆర్‌ కొత్త ఫార్మాట్‌ను  మార్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి రాష్ర్టాలు సంయుక్తంగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నది. ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై నిపుణులతో రాష్ట్ర అధికారులు చర్చిస్తున్నారు.logo
>>>>>>