శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 01:33:40

విశ్వాస పరీక్షకు సిద్ధమే

విశ్వాస పరీక్షకు సిద్ధమే
  • మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ వెల్లడి
  • గవర్నర్‌తో భేటీ
  • రాజకీయ సంక్షోభంపై వినతిపత్రం

భోపాల్‌: అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సిద్ధమేనని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ శుక్రవారం చెప్పారు. తమ పార్టీకి చెందిన 22 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆయన గవర్నర్‌ లాల్జీటాండన్‌ను కలిశారు. సుమారు అరగంటపాటు గవర్నర్‌తో భేటీ అయిన ఆయన రాజకీయ సంక్షోభం తలెత్తడానికి గల కారణాలు, ఇందులో బీజేపీ పాత్ర గురించి గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మూడు పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు మూల కారణం బీజేపీనేనని, ఆ పార్టీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని వినతి పత్రంలో పేర్కొ న్నారు.  గవర్నర్‌తో సమావేశం అనంతరం కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేల రాజీనామా ప్రక్రియ జరిగిందని,  విశ్వాస పరీక్షకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. మరోవైపు కమల్‌నాథ్‌ సూచనమేరకు  కాంగ్రెస్‌ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులను పదవుల నుంచి గవర్నర్‌ తొలగించారు. ఇంకోవైపు జ్యోతిరాదిత్య శుక్రవారం మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసేందుకు తొలుత సిద్ధమైనప్పటికీ, చివరికి తమప్రయత్నాన్ని విరమించుకున్నారు.


logo