మంగళవారం 14 జూలై 2020
National - Jun 26, 2020 , 16:48:51

కావాల‌నుకుంటే 10 విద్యార్థులు పరీక్ష రాయొచ్చు: HRD మంత్రి

కావాల‌నుకుంటే 10 విద్యార్థులు పరీక్ష రాయొచ్చు: HRD మంత్రి

న్యూఢిల్లీ: ఫలితాల‌తో సంతృప్తి చెంద‌ని 10వ త‌ర‌గ‌తి విద్యార్థులు కావాల‌నుకుంటే మ‌ళ్లీ ప‌రీక్ష రాయొచ్చ‌ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 'ఇటీవ‌ల పెండింగ్‌లో ప‌డిన సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను జూలై 1 నుంచి 15 వ‌ర‌కు నిర్వహించాల‌ని సంబంధిత బోర్డులు నిర్ణ‌యించాయి. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆ ప‌రీక్ష‌లు ర‌ద్ద‌య్యాయి. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు గ‌త ప‌రీక్ష‌ల్లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా జూలై 15న ఫ‌లితాలు విడుద‌ల చేసేందుకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స‌మాయ‌త్త‌మ‌య్యాయి' అని HRD మంత్రి తెలిపారు. 

అయితే, జూలై 15న విడుద‌ల‌య్యే ఫ‌లితాల‌తో సంతృప్తి చెంద‌ని సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి విద్యార్థులు మ‌ళ్లీ ప‌రీక్ష రాయవ‌చ్చ‌ని మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. అయితే అన్ని స‌బ్జెక్టులు రాసేందుకు అవ‌కాశం లేద‌ని, ఏయే స‌బ్జెక్టుల్లోనైతే విద్యార్థులు త‌మ‌కు వ‌చ్చిన మార్కుల కంటే ఎక్కువ‌గా సాధించ‌గ‌ల‌మ‌ని భావిస్తారో ఆ స‌బ్జెక్టుల‌కు సంబంధించిన ప‌రీక్ష‌లు రాయ‌వ‌చ్చ‌ని మంత్రి వివ‌రించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేంద్రం విద్యార్థుల చ‌దువుల కంటే జీవితాల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న‌ద‌ని, అందుకే ప‌రీక్ష‌లను ర‌ద్దు చేసింద‌ని చెప్పారు. 

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో జూలై 1 నుంచి 15 వ‌ర‌కు నిర్వ‌హంచ త‌ల‌పెట్టిన ప‌బ్లిక్‌ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌లేకపోతున్నామ‌ని సెంట్ర‌ల్ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్ఈ), ఇండియ‌న్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (ఐసీఎస్ఈ) సుప్రీంకోర్టుకు తెలియ‌జేశాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై స్ప‌ష్ట‌త కోసం దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాయి. ఫ‌లితాల‌ను జూలై 15న వెల్ల‌డించనున్న‌ట్లు స్ప‌ష్టం చేశాయి.  


   


logo