శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 12:23:46

వ‌చ్చేనెల‌ 1 నుంచి సినిమా హాళ్లు ఓపెన్‌

వ‌చ్చేనెల‌ 1 నుంచి సినిమా హాళ్లు ఓపెన్‌

కోల్‌కతా: క‌రోనా వ్యాప్తిని నిలువ‌రించ‌డానికి విధించిన‌ లాక్‌డౌన్ నిబంధ‌ల‌ను ప్ర‌భుత్వాలు ఒక్కొక్క‌టిగా స‌డ‌లిస్తున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం సినిమా హాళ్లు, ఓపెన్‌-ఎయిర్‌ థియేటర్లు తిరిగి తెరచుకునేందుకు అనుమతివ్వ‌నుంది. అక్టోబ‌ర్ 1 నుంచి సినిమా టాకీస్‌లు, ఓపెన్-ఎయిర్ థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చ‌ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్ర‌క‌టించారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో 50 మందికే అనుమ‌తిస్తామ‌ని చెప్పారు. ఈమేర‌కు సీఎం ట్వీట్ చేశారు.

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మార్చి 23న దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో గత ఆరు నెలలుగా థియేటర్లు మూసే ఉన్నాయి. అయితే సీఎం తాజా నిర్ణయంతో 'అక్టోబర్‌ 1 నుంచి థియేటర్లు తెరచుకోనున్నాయి. వీటితోపాటు అన్ని మ్యూజికల్‌, డ్యాన్సింగ్‌ ఈవెంట్స్‌, మ్యాజిక్‌ షోలను అనుమతిస్తామ‌ని తెలిపారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని స్ప‌ష్టం చేశారు.