సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 14:55:52

నితీశ్‌ పాదాలకు నమస్కరించి.. ఆపై షాక్‌ ఇచ్చిన చిరాగ్‌

నితీశ్‌ పాదాలకు నమస్కరించి.. ఆపై షాక్‌ ఇచ్చిన చిరాగ్‌

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యవహారం జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) అధినేత, సీఎం నితీశ్‌ కుమార్‌కు తలనొప్పిగా మారింది. ఇటీవల మరణించిన కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ స్మారక కార్యక్రమం మంగళవారం జరిగింది. సీఎం నితీశ్‌ దీనికి హాజరు కాగా గౌరవ సూచికంగా చిరాగ్ ఆయన పాదాలకు నమస్కరించారు. అనంతరం వారిద్దరు కొంత సేపు పక్కపక్కన కూర్చొన్నారు. దీంతో నితీశ్‌పై గత కొన్ని రోజులుగా మండిపడుతున్న చిరాగ్‌ మెత్తబడినట్లుగా అంతా భావించారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే నితీశ్‌కు చిరాగ్‌ షాక్‌ ఇచ్చారు. ఎన్నికల్లో  జేడీ(యూ) అభ్యర్థులపై పోటీకి నిలిపిన వారి జాబితాను ప్రకటించారు. 

ముఖ్యంగా గైఘాట్ నియోజకవర్గంలో నితీశ్‌ అనుచరుడైన జేడీ(యూ) అభ్యర్థి మహేశ్వర్‌ యాదవ్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే దినేశ్‌ సింగ్‌ కుమార్తె కోమల్‌ సింగ్‌ను చిరా‌గ్‌ పోటీకి దించారు. తన కుమార్తెకు జేడీ(యూ)లో సీటు కోసం ప్రయత్నించిన దినేశ్‌ సింగ్‌ అక్కడ కుదరకపోవడంతో చిరాగ్‌తో మాట్లాడి ఎల్జేపీ నుంచి పోటీ చేయిస్తున్నారన్న వాదన వినిపిస్తున్నది. మరోవైపు కోమల్‌ సింగ్‌ తల్లి వీనా సింగ్‌ ఎల్జేపీ సభ్యురాలు కావడంతోనే ఆ పార్టీ నుంచి కోమల్‌ సింగ్‌ పోటీ చేస్తున్నట్లు జేడీ(యూ) నేతలు చెబుతున్నారు. అయితే నితీశ్‌ పాదాలకు నమస్కరించి ఆయనతో సఖ్యతగా ప్రవర్తించినట్లుగా కనిపించిన చిరాగ్‌ అనంతరం కొన్ని గంటల్లోనే ఈ షాక్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ఎన్డీయేతో కాకుండా ఎల్జేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని చిరాగ్ ప్రకటించారు. ఎన్నికల అనంతరం బీజేపీ, ఎల్జేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆయన ప్రధాని మోదీజీకి తాను హనుమంతుడినని, తన గుండెను చీల్చితే ఆయనే కనిపిస్తారంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి