శుక్రవారం 10 జూలై 2020
National - Jun 18, 2020 , 15:08:03

చైనాపై పెరుగుతున్న వ్యతిరేకత.. భారత్‌లోని చైనీయుల ఆందోళన

చైనాపై పెరుగుతున్న వ్యతిరేకత.. భారత్‌లోని చైనీయుల ఆందోళన

న్యూఢిల్లీ: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో జరిగిన భారత్‌, చైనా సైనికుల ఘర్షణ ఇరు దేశాల మధ్య సంబంధాలను బాగా ప్రభావితం చేసింది. ఈ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందడంపై దేశ ప్రజలు రగిలిపోతున్నారు. చైనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చైనా జెండాలను, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. అలాగే చైనా తయారీ వస్తువులను బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వాటిని తగులపెడుతున్నారు. మాజీ సైనికులకు చెందిన ఓ బృందంతోపాటు పలువురు ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లోని చైనీయులు ఆందోళన చెందుతున్నారు. చైనాపై పెరుగుతున్న వ్యతిరేకత వల్ల తమపై దాడులు జరుగవచ్చన్న భయంతో గత రెండు రోజులుగా వారు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. మరోవైపు కొందరు చైనీయులకు వారి భారత స్నేహితులు బాసటగా ఉంటున్నారు. చైనాలోని కొన్ని కుటుంబాలు కూడా తమ వారి భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. అయితే భారతీయులు మంచివారని, తమకు ఏమీ కాదని చైనాలోని తమ కుటుంబాలకు ఇక్కడున్న వారిలో కొందరు భరోసా ఇస్తున్నారు. 

చైనాకు చెందిన విద్యార్థులు, వ్యాపారులు సుమారు మూడు వేల మంది భారత్‌లో ఉంటున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల వీరితోపాటు చైనా పర్యాటకులు చాలా మంది భారత్‌లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చేవారి కోసం ఐదు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు మే 25న చైనా పేర్కొంది. రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పింది. కాగా, భారత్‌లో సుమారు 2 వేల చైనా సంస్థలున్నాయి. ఇరు దేశాల మధ్య ఘర్షణ నేపథ్యంలో వాటి వ్యాపార కార్యకలాపాలతోపాటు చైనా పెట్టుబడులపైనా ప్రభావం చూపే అవకాశమున్నదని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే చదువు కోసం భారత్‌ వచ్చే చైనా విద్యార్థులు, చైనా పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గవచ్చని అంటున్నారు. logo