శనివారం 11 జూలై 2020
National - Jun 30, 2020 , 12:32:39

చైనా దురాక్ర‌మ‌ణ‌.. పాన్‌గాంగ్ వ‌ద్ద భారీ మ్యాప్‌, మాండ‌రిన్ చిహ్నం

చైనా దురాక్ర‌మ‌ణ‌.. పాన్‌గాంగ్ వ‌ద్ద భారీ మ్యాప్‌, మాండ‌రిన్ చిహ్నం

హైద‌రాబాద్‌: ల‌డ‌ఖ్‌లోని పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద చైనా భారీ స్థాయిలో ఆక్ర‌మ‌ణకు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.  తాజాగా రిలీజైన్ శాటిలైట్ చిత్రాల్లో ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది.  పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద వివాదాస్ప‌ద భూభాగంలో.. చైనా త‌మ దేశానికి చెందిన భారీ మ్యాప్‌ను వేసింది.  అక్క‌డే మాండ‌రిన్ భాష‌లో ఓ చిహ్నాన్ని కూడా గీసింది.  ఫింగ‌ర్ 4 నుంచి ఫింగ‌ర్ 5 మ‌ధ్య ఈ గుర్తులు ఉన్న‌ట్లు శాటిలైట్ చిత్రాల్లో తేలింది.  భూమిపై వేసిన ఆ భారీ గుర్తులు 81 మీట‌ర్ల పొడుగు, 25 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  

పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద‌ ఫింగ‌ర్స్ ప్రాంతాల‌ను కీల‌కంగా భావిస్తారు. ఫింగ‌ర్ 1 నుంచి ఫింగ‌ర్ 8 వ‌ర‌కు పెట్రోలింగ్ చేసేందుకు త‌మ‌కు అధికారం ఉన్న‌ద‌ని భార‌త్ న‌మ్ముతున్న‌ది. అయితే ఫింగ‌ర్ 8 నుంచి ఫింగ‌ర్ 4 మ‌ధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ చేసే హ‌క్కు త‌మ‌కు ఉన్న‌ద‌ని చైనా పేర్కొంటున్న‌ది.  మే నెల‌లో రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన త‌ర్వాత‌.. ఫింగ‌ర్ 4 ప్రాంతాన్ని బౌండ‌రీ లైన్‌గా భావిస్తున్నారు.  ఫింగ‌ర్ 4 వ‌ద్ద ఉన్న చైనా సైనికులు.. ఫింగ‌ర్ 8 వ‌ర‌కు వెళ్ల‌కుండా భార‌త పెట్రోలింగ్ ద‌ళాల‌ను అడ్డుకుంటున్నారు. 

 అయితే ఫింగ‌ర్ 4 ప్రాంతం నుంచి చైనా ద‌ళాలు భారీ స్థాయిలో టెంట్లు వేసిన‌ట్లు తెలుస్తోంది.  186 చోట్ల తాత్కాలిక టెంట్లు వేసిన‌ట్లు శాటిలైట్ చిత్రాల్లో గుర్తించారు. స‌ర‌స్సు వ‌ద్దనే కాకుండా, సుమారు 8 కిలోమీట‌ర్ల మేర ప‌ర్వ‌తాల వెంట ఆక్ర‌మ‌ణ చేసిన‌ట్లు తెలుస్తోంది.  గాల్వ‌న్ ఘ‌ట‌న త‌ర్వాత మ‌రోసారి ఇవాళ చుషుల్ ప్రాంతంలో క‌మాండ‌ర్స్ స్థాయి చ‌ర్చ‌లు ప్రారంభం అయ్యాయి. వాస్త‌వాధీన రేఖ వెంట ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితిపై రెండు దేశాల సైనికాధికారులు చర్చించ‌నున్నారు.


logo