ఆదివారం 12 జూలై 2020
National - Jun 24, 2020 , 15:19:51

పోర్టుల వద్ద నిలిచిపోయిన చైనా దిగుమతులు

పోర్టుల వద్ద నిలిచిపోయిన చైనా దిగుమతులు

న్యూఢిల్లీ: చైనా నుంచి దిగుమతి అయ్యే సరుకులు, వస్తువులు రెండు రోజులుగా పోర్టుల వద్ద నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక ఓడ రేవులు, ఎయిర్‌పోర్టులకు చేరిన చైనా వస్తువుల కంటైనర్లను అక్కడి నుంచి పంపడం లేదు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దులో చైనాతో ఘర్షణ నేపథ్యంలో ఆ దేశ దిగుమతులను పోర్టుల వద్ద నిలిపివేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో ఆ దేశం నుంచి వచ్చే వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు పోర్టుల వద్దనే ఉంచినట్లు కొందరు చెబుతున్నారు. 

కాగా చైనా వస్తువులను వంద శాతం తనిఖీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 22 నుంచి అవి పోర్టుల వద్ద ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చైనా దిగుమతుల నిషేధంపై ఎలాంటి ఆదేశాలు లేవని పేర్కొన్నాయి. లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన భారీ ఘర్షణ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా వస్తువులు, కాంట్రాక్టులను బహిష్కరించాలన్నడిమాండ్‌ ఊపదుకున్నది. దీంతో చైనా దిగుమతులను తగ్గించుకుంటామని వ్యాపార సంఘాలు పేర్కొన్నాయి. రైల్వేతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం చైనా ప్రాజెక్టులను రద్దు చేశాయి. మరోవైపు భారత్‌ ఆత్మనిర్భర్‌ కార్యక్రమంలో భాగంగా మేకిన్‌ ఇండియాపై దృష్టిపై సారించిన కేంద్రం వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయో అన్నది స్పష్టంగా పేర్కోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

 logo