సోమవారం 13 జూలై 2020
National - Jun 27, 2020 , 14:02:04

మా ఊరిలో చైనా వస్తువులు అమ్మం.. కొనం

మా ఊరిలో చైనా వస్తువులు అమ్మం.. కొనం

పుణె: లడాఖ్‌ వద్ద సరిహద్దులో భారత్‌-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చైనా వస్తువులను బహిష్కరించడంపై సర్వత్రా గొంతులు వినిపిస్తున్నాయి. ఇదే ఒరవడిలో మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని కొంధవే-ధవాడే గ్రామ పంచాయతీ గ్రామంలో చైనా వస్తువులను అమ్మడం, కొనడాన్ని నిషేధిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నిబంధనలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నది. 

మన సైనికులను దెబ్బతీయడమే కాకుండా మన భూభాగంలోకి చొచ్చుకురావాలని చూస్తున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు ఆదేశ వస్తువులను బహిష్కరించాలని దేశంలోని చాలా ప్రాంతాల్లో పిలుపునిస్తున్నారు. పుణె జిల్లా పరిధిలోని కొంధవే-ధవాడే గ్రామ పంచాయతీ మాత్రం ఒక అడుగు ముందుకేసి తమ గ్రామంలో చైనా వస్తువులు అమ్మడంగానీ, కొనడం గానీ నిషేధిస్తున్నట్టు తీర్మాణం చేసింది. ఈ నిబందన జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీ సర్క్యులర్ జారీ చేసింది. దీనిని గ్రామంలోని ప్రజలతోపాటు దుకాణాదారులకు పంచిపెట్టనున్నారు.  

'నెలవారీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం గురించి గ్రామ పంచాయతీ కాంట్రాక్టర్లకు కూడా తెలియజేస్తున్నాం. ఈ మేరకు చైనా చక్కెర ఉత్పత్తిని కూడా ఉపయోగించకూడదనే పరిస్థితిని వెల్లడిస్తున్నాం. చైనా ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలను నిషేధించాలని మేము దుకాణదారులను, గ్రామస్తులను కోరుతున్నాం. ఇందుకోసం పోస్టర్ బ్యానర్లు కూడా వేస్తాం' అని కొంధవే-ధావడే గ్రామ సర్పంచ్ నితిన్ ధావాడే చెప్పారు.

జూన్ 15 న తూర్పు లడఖ్‌లోని గల్వాన్‌ వ్యాలీలో వందలాది మంది చైనా సైనికులు భారత సైనికులపై మోసపూరితంగా దాడి చేసిన ఘటనలో 20 మంది భారతీయ సైనికులు అమరవీరులు అయ్యారు. 76 మంది చైనా సైనికులు కూడా గాయపడ్డారు. చైనా యొక్క ఈ చర్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాతో వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. చైనా సైనిక చర్య తరువాత మోదీ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. దేశంలో తయారైన ఉత్పత్తుల కొనుగోలును పెంచాలని, చైనాలో తయారైన గణపతి విగ్రహాలను కొనవద్దంటూ ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.


logo