ఆదివారం 05 జూలై 2020
National - Jun 29, 2020 , 02:08:12

పీవోకేలో చైనా విమానాలు

పీవోకేలో చైనా విమానాలు

  • పాక్‌తో కలిసి కుతంత్రం!
  • గల్వాన్‌ ఘటనకు ముందే మార్షల్‌ ఆర్ట్స్‌  ఆర్మీ తరలింపు
  • స్కర్దూ ఎయిర్‌ బేస్‌లో కదలికలు
  • పాక్‌తో కలిసి చైనా కుతంత్రాలు
  • డ్రాగన్‌కు దీటుగా భారత్‌ సన్నద్ధం
  • తూర్పు లఢక్‌లో సైన్యాల ముఖాముఖి 

న్యూఢిల్లీ: భారత్‌తో కయ్యానికి చైనా, పాకిస్థాన్‌ ఒక్కటయ్యాయి. పీవోకేలోని స్కర్దూ వాయుసేన స్థావరంలో చైనా విమానాలు మోహరించారు. చైనాకు చెందిన ఐఎల్‌ 78 ట్యాంకర్‌ విమానాన్ని భారత్‌ నిఘా వర్గాలు స్కర్దూలో గుర్తించాయి. ఇది యుద్ధ విమానాలు గాల్లో ఉండగానే ఇంధనాన్ని నింపగలదు. మరోవైపు తూర్పు లఢక్‌లోనూ చైనా  కార్యక్రమాలు పెరిగాయి. వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భారత్‌- చైనా సైన్యాలు ఇంకా ముఖాముఖి నిలిచే ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 

భారత్‌ అప్రమత్తం

చైనా కుట్రలను గమనించిన భారత్‌ కూడా డ్రాగన్‌కు దీటుగా సన్నద్ధమవుతున్నది. ఆకాశ్‌ గగనతల రక్షణ వ్యవస్థను చైనా సరిహద్దుకు తరలించింది. అత్యవసరంగా 21 మిగ్‌-29 విమానాలు, 12 సుఖోయ్‌ విమానాలు కొననున్నట్టు తెలుస్తున్నది. కాగా, మిత్రదేశాలైన జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియాలను బలోపేతం చేసేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌-2021కింద ఈ మూడు దేశాల యుద్ధ పైలట్లకు  శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు బిల్లును గురువారం సెనేట్‌లో ఆమోదానికి పెట్టారు.

2 నెలలకు సరిపడా సిలిండర్లు నిల్వ

కశ్మీర్‌లో 2 నెలలకు సరిపడా సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని కేంద్రం అక్కడి కంపెనీలను ఆదేశించింది. కార్గిల్‌ సమీపంలో ఉన్న గాందర్‌బల్‌ జిల్లాలో 16 పాఠశాల భవనాలను ఖాళీ చేయాలని ఎస్పీ ఆదేశించారు. అమర్‌నాథ్‌ యాత్ర సందర్భంగా వీటిలో సీఏపీఎఫ్‌ బలగాలు ఉంటాయని చెప్పారు. తాజా ఉత్తర్వులు స్థానికుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. సాధారణంగా చలికాలంలో సిలిండర్లకు సంబంధించిన ఆదేశాలు ఇస్తారు. వేసవి కాలంలో ఇవ్వడం ఇదే మొదటిసారి. 

48 శాతం ఉక్కు ఎగుమతులు చైనాకే ఏప్రిల్‌, మేలో భారత్‌ నుంచి భారీగా ఉక్కు దిగుమతి

కోల్‌కతా: గత ఏప్రిల్‌, మే నెలల్లో దేశంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా, భారత్‌ నుంచి చైనా అత్యధికంగా ఉక్కును దిగుమతి చేసుకున్నట్లు వెల్లడైంది. మొత్తం ఉక్కు ఎగుమతుల్లో చైనా వాటానే 48%. జాయింట్‌ ప్లాంట్‌ కమిటీ వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 1 - మే 31 మధ్య కాలంలో భారత్‌ నుంచి చైనా 4.40 లక్షల టన్నుల ఫినిష్డ్‌ స్టీల్‌ను, 10 లక్షల టన్నుల సెమీఫినిష్డ్‌ స్టీల్‌ను దిగుమతి చేసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో ఉక్కు ఎగుమతులు 76% పెరిగాయని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ జయంత రాయ్‌ తెలిపారు. పెరిగిన ఎగుమతుల్లో 60% చైనాకే వెళ్లాయన్నారు.

సరిహద్దు వివాదంపై ప్రతివారం చర్చలు

ఛండీగఢ్‌: సరిహద్దు వివాదంపై వారంవారం చర్చలు నిర్వహించాలని భారత్‌, చైనా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. డబ్ల్యూఎంసీసీ (వర్కింగ్‌ మెకానిజం ఫర్‌ కన్సల్టేషన్‌ అండ్‌ కోఆర్డనేషన్‌) సమావేశం ద్వారా సంప్రదింపులు జరుపాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. 

‘గల్వాన్‌'కు ముందే మార్షల్‌ ఆర్ట్స్‌  బలగాలు

గల్వాన్‌ లోయలో చైనా పక్కా ప్రణాళికతోనే భారత్‌తో ఘర్షణకు దిగిందన్న వాదనలకు మరింత బలాన్నిచ్చే విషయాలను ఆ దేశ అధికార మిలిటరీ పత్రిక చైనా నేషనల్‌ డిఫెన్స్‌ న్యూస్‌ వెల్లడించింది. గల్వాన్‌ ఘటనకు కొద్ది రోజుల ముందే ఆ ప్రాంతానికి సమీపంలో పర్వతారోహకులు, మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణులు చేరుకున్నారని తెలిపింది. జూన్‌ 15న టిబెట్‌ రాజధాని లాసాలో కొత్తగా 5 మిలీషియా బృందాలు మోహరించాయని పేర్కొన్నది. 

33 రోజుల్లో చైనా వికృత క్రీడ

న్యూఢిల్లీ: తూర్పు లఢక్‌లో ఇటీవల దుశ్చర్యకు పాల్పడిన చైనా.. వ్యూహాత్మక గల్వాన్‌ ప్రాంతంలో సాగించిన ఆక్రమణల, కవ్వింపుల భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేవలం 33 రోజుల వ్యవధిలోనే గల్వాన్‌ నదీ పరీవాహకంలో డ్రాగన్‌ దేశం నిర్మించిన స్థావరాలు, సైనిక మోహరింపులు ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా బయటకు వచ్చాయి. మే 22 నుంచి జూన్‌ 26 మధ్య మాక్సర్‌, ప్లానెట్‌ ల్యాబ్స్‌ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతున్నది. తూర్పు లఢక్‌లోని గల్వాన్‌ లోయ గుండా వాస్తవాధీన రేఖ వెళ్తున్నది.  ఇక్కడే జూన్‌ 15న ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఓ వైపు చర్చలు జరుగుతుండగా.. చైనా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గులాబీ రంగు టెంట్లు ఏర్పాటుచేసినట్లు, జవాన్లను మోహరించినట్లు జూన్‌ 22నాటి శాటిలైట్‌ చిత్రాల ద్వారా తెలుస్తున్నది. జూన్‌ 25న తీసిన తాజా చిత్రాల్లో గులాబీ టెంట్ల స్థానంలో నలుపు రంగు టెంట్లు ఉన్నాయి. జవాన్లు లేరు. దీన్నిబట్టి చైనా బలగాలు వెనుదిరిగినట్లు  భావిస్తున్నారు.

రెండు యుద్ధాల్లోనూ గెలుస్తాం: అమిత్‌ షా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి, సరిహద్దుల వద్ద చైనాపై మోదీ ప్రభుత్వం ఏకకాలంలో యుద్ధం చేస్తున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ఈ రెండింటిలో భారత్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్షోభ కాలంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన విమర్శించారు. రాహుల్‌ భారత్‌ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, దాన్ని అడ్డుకుంటామని చెప్పారు. భారత వ్యతిరేక ప్రచారంపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ నినాదాలను చైనా, పాక్‌ ముందుకు తీసుకువెళ్తున్నాయని విమర్శించారు.

చైనా దిగుమతులకు నేను వ్యతిరేకం: గడ్కరీ

న్యూఢిల్లీ: చైనా దిగుమతులకు తాను వ్యతిరేకమని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తులను నిలిపివేయాలన్నారు. దిగుమతులను తగ్గించుకుంటూ, ఎగుమతులను క్రమంగా పెంచుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు యువతకు కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.


logo