ఆదివారం 05 జూలై 2020
National - Jun 20, 2020 , 11:31:36

భారత కార్మికులను తొలగించిన చైనా కంపెనీ

భారత కార్మికులను తొలగించిన చైనా కంపెనీ

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని భాల్‌ఘాట్‌లో ఉన్న ముడి ఖనిజం తవ్వకం విధుల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికులను చైనాకు చెందిన ఓ కంపెనీ తొలగించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్నందునే కార్మికులను తొలగించాల్సి వచ్చిందని సదరు కంపెనీ వాదిస్తుండగా.. లాక్‌డౌన్‌ విధించిన సమయంలోనే తమతో పనులు చేయించారని కార్మికులు ఆరోపిస్తున్నారు. 

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని భాల్‌ఘాట్‌లో మాంగనీస్‌ ముడి ఖనిజం గనులు ఉన్నాయి. ఇక్కడ తవ్వకం పనులను భారత ప్రభుత్వానికి చెందిన మాంగనీస్ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంవోఐఎల్‌) చైనాకు చెందిన ఓ కంపెనీకి కాంట్రాక్ట్‌కు ఇచ్చింది. అయితే, గల్వాన్‌లో ఇరుదేశాల మధ్య ఘర్షణ నేపథ్యంలో తమ వద్ద కాంట్రాక్ట్‌ పద్ధతిపై పనిచేస్తున్న 72 మందిని ఎలాంటి కారణం చూపకుండానే విధుల్లో నుంచి తొలగించింది. దీనిపై కార్మికులు సదరు కంపెనీ యాజమాన్యానికి, జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు.

దాంతో దిగొచ్చిన కంపెనీ.. తొలగిస్తున్న కార్మికులకు అడ్వాన్స్‌గా రూ.10 వేలు చెల్లిస్తామని అంగీకరించింది. అయితే, తీరా రూ.5వేలు చేతిలో పెట్టి చేతులు దులిపేసుకొన్నదని కార్మికులు వాపోయారు. లాక్‌డౌన్‌ విధించిన సమయంలోనే తమతో తవ్వకం పనులు చేయించారని, తమలో ఎవరికీ కరోనా వైరస్‌ సోకనప్పటికీ గల్వాన్‌ ఘర్షణను దృష్టిలో పెట్టుకొనే ఇలాంటి నిర్ణయం తీసుకొన్నదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చొరువ చూపి తమను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

ఇలాఉండగా, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగానే కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పక్కనపెట్టామని, వారికి నిత్యావసరాల కోసం అడ్వాన్స్‌ కూడా చెల్లించామని భాల్‌ఘాట్‌లో ఎంవోఐఎల్‌ కంపెనీ మేనేజనర్‌ ఉమాయిద్‌ సింగ్‌ భట్టి తెలిపారు. గల్వాన్‌ ఘర్షణలతో వీరి తొలగింపునకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ తవ్వకం పనులు ప్రారంభం కాగానే వారిని విధుల్లోకి తీసుకొనేలా  చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.


logo