మంగళవారం 14 జూలై 2020
National - Jun 26, 2020 , 16:44:20

చైనా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నది: భారత్‌

చైనా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నది: భారత్‌

న్యూఢిల్లీ: చైనా యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నదని భారత్‌ ఆరోపించింది.  ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తూ తూర్పు లఢక్‌ సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తున్నదని విమర్శించింది. ఇరు దేశాల సైనికులను సరిహద్దుల వద్ద తగినంత తక్కువ స్థాయిలో ఉంచాలని 1993లో నాటి భారత ప్రధాని పీవీ నరసింహారావు, నాటి చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మధ్య జరిగిన ఒప్పందానికి చైనా ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తూట్లు పొడుస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో ఆరోపించింది.

సరిహద్దు వెంబడి ఉన్న నియంత్రణ రేఖ వద్ద గత ముప్పై ఏండ్లుగా ఉన్న శాంతియుత వాతావరణానికి చైనా భంగం కలిగిస్తున్నదని భారత్‌ విమర్శించింది.  గత మూడు రోజులుగా భారీగా సైన్యం, ఆయుధాలను పీఎల్‌ఏ మోహరిస్తున్నదని, ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొంది. అయితే సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత్‌ స్పష్టం చేసింది.

మరోవైపు డార్బుక్-ష్యోక్-డిబిఓ రహదారిని భారత్‌ పూర్తి చేయడం మన దేశానికి అనుకూలంగా మారింది. దీంతో కరాకోరం పాస్‌లోని సమీప ప్రాంతాలకు టీ-90 ట్యాంకులు, రష్యాకు చెందిన బీఎంపీ యాంఫిబియస్‌ పదాతిదళ పోరాట వాహనాలు, అమెరికన్ ఎం-777 155ఎంఎం హోవిట్జర్లను భారత్‌ మోహరించింది. కాగా ఈ కీలక సరిహద్దు ప్రాంతంలో రహదారి నిర్మాణంతోపాటు, ఈ స్థాయిలో భారత బలగాల మోహరింపుపై చైనా కలవరం చెందుతున్నది. 
logo