ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 16:00:22

భారీగా పడిపోయిన చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మార్కెట్ షేర్

భారీగా పడిపోయిన చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మార్కెట్ షేర్

ఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఉత్పత్తుల బహిష్కరణ ఎఫెక్ట్ ఆదేశ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మార్కెట్ షేర్ తీవ్రంగా పడింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్‌లో చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మార్కెట్ షేర్ భారీగా పడిపోయినట్లు వెల్లడైంది. సాధారణంగా మన దేశ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్‌లో చైనీస్‌దే హవా. టాప్ ఫైవ్ లో షియోమీ, ఒప్పో, వివో వంటి నాలుగు కంపెనీలు ఉండటం గమనార్హం. వీటి వాటా 81 శాతం పైగా ఉంటుంది. అయితే కరోనా, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో క్రమంగా చైనీస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ తగ్గిపోయింది. జనవరి - మార్చిలో 81 శాతంగా ఉన్న చైనీస్ బ్రాండ్ మార్కెట్ వాటా ఏప్రిల్ -జూన్ నాటికి 72 శాతానికి పడిపోయిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తన నివేదికలో తెలిపింది.

కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ పరిణామాలు, భారత్ చౌనా సరిహద్దు ఉద్రిక్తతలు, ప్రభుత్వం 59 చైనీస్ యాప్స్ పైన నిషేధం విధించడం, చైనా ఉత్పత్తులపై ప్రజల్లో వ్యతిరేకత వంటి వివిధ కారణాలు ఉన్నాయని తెలిపింది. ఈ పరిమాణం శాంసంగ్‌తో పాటు మైక్రోమాక్స్, లావా వంటి దేశీయ బ్రాండ్స్‌కు కలిసి వస్తుందని, మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. స్వదేశీ ఉత్పత్తులే కొనుగోలు చేయాలనే డిమాండ్ చాలామంది ప్రజల్లో నాటుకు పోయింది. జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో షియోమీ 29 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత శాంసంగ్ 26 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. వివో 17 శాతం, రియల్ మి 11 శాతం, ఒప్పో 9 శాతం, ఇతర కంపెనీలు 8 శాతం వాటాతో ఉన్నాయి. అయితే శాంసంగ్, దేశీయ స్మార్ట్ ఫోన్స్‌కు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నది.

ప్రస్తుత పరిణామం జియో తీసుకు రానున్న 4జీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు కూడా ప్రయోజనం కలగవచ్చని విశ్లేషకులు  చెబుతున్నారు. మార్చితో ముగిసిన క్వార్టర్‌లో షియోమీ 30 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వివో 17 శాతం, రియల్‌మి 14 శాతం, ఒప్పో 12 శాతం మార్కెట్ వాటాతో నిలిచాయి. అంతకుముందు 16 శాతంతో మూడో స్థానంలో శాంసంగ్ జూన్ క్వార్టర్ నాటికి పుంజుకుని 26 శాతం మార్కెట్ షేర్‌తో రెండో స్థానంలోకి వచ్చింది. రూ.30,000కు పైగా ధర కలిగిన ఖరీదైన ఫోన్ల విషయాికి వస్తే వన్ ప్లస్ మొదటి స్థానంలో, రూ.45,000 ధర కలిగిన అత్యంత ఖరీదైన ఫోన్లలో యాపిల్‌ది అగ్రస్థానం. ఫీచర్ ఫోన్స్ విభాగంలో ఐటెల్ 24 శాతం, లావా 23 శాతం, శాంసంగ్ 22 శాతం, నోకియా 9 శాతం, కార్బన్ 5 శాతం వాటాలు కలిగి ఉన్నాయి.


logo