గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 25, 2021 , 14:51:05

భారత్‌ వ్యాక్సిన్లపై డ్రాగన్‌ దుష్ప్రచారం

భారత్‌ వ్యాక్సిన్లపై డ్రాగన్‌ దుష్ప్రచారం

న్యూఢిల్లీ : కోవిడ్‌-19  టీకాల అభివృద్ధి, సరఫరాల్లో  భారత్‌ దూకుడుపై చైనా దుష్ప్రచారం సాగిస్తోంది. భారత్‌ సకాలంలో వ్యాక్సిన్లను సరఫరా చేయడం, పెద్దసంఖ్యలో ఉత్పత్తులు చేపట్టడంతో దక్షిణాసియాలో తాము వెనుకంజ వేశామనే ఆందోళనలో తన అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో విషం చిమ్ముతూ డ్రాగన్‌ దుర్నీతికి తెగబడుతోంది. ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో దేశీయంగా సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తయారుచేసిన కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌ను ఆప్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, శ్రీలంక మినహా అన్ని సార్క్‌ దేశాలకూ బహుమతిగా అందించింది. అయితే రాబోయే రోజుల్లో భారత్‌ ఐదు లక్షల వ్యాక్సిన్‌ డోసులను శ్రీలంకకు ఉచితంగా అందచేయడంతో పాటు ఆప్ఘనిస్తాన్‌కూ వ్యాక్సిన్‌ సరఫరాలపై హామీ ఇచ్చింది.

వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాల్లో భారత్‌ అంతర్జాతీయంగా చురుకైన పాత్ర పోషిస్తుండటంతో భారత్‌ చేపట్టిన ‘వ్యాక్సిన్‌ మైత్రి’పై చైనా దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకుంది. సీరం ఇనిస్టిట్యూట్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాన్ని ఉటంకిస్తూ భారత్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యంపై గ్లోబల్‌ టైమ్స్‌లో సందేహాలను లేవనెత్తింది. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో వ్యాక్సిన్‌ తయారీపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని సీరం ఇనిస్టిట్యూట్‌లో జరిగిన అగ్నిప్రమాదం దెబ్బతీసిందని గ్లోబల్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించిందని విశ్లేషకులు గుర్తుచేశారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ తయారీ ముందుకు సాగదని జోస్యం చెబుతోందని చెప్పుకొచ్చారు. చైనాలో పనిచేస్తున్న భారత ఉద్యోగులు చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌పై నమ్మకంతో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వేచిచూస్తున్నారని చైనాపత్రిక కథనాలను వండివార్చింది. 

VIDEOS

logo