శనివారం 04 జూలై 2020
National - Jun 23, 2020 , 02:39:20

నోరు విప్పిన చైనా!

నోరు విప్పిన చైనా!

  • తమ కమాండింగ్‌ ఆఫీసర్‌ చనిపోయాడని  వెల్లడి
  • మొత్తమ్మీద 20 మంది కంటే తక్కువే  మరణించారు
  • భారత్‌పై ఒత్తిడి పెరుగుతుందనే చెప్పలేదు 
  •  చైనా వ్యతిరేకతను అదుపులో పెట్టుకోవాలి
  • లేకపోతే 1962 కన్నా భారత్‌కు ఎక్కువ నష్టం 
  •  విశ్లేషకుల పేరిట గ్లోబల్‌ టైమ్స్‌ కథనం
  • మరణాల సమాచారం లేదన్న చైనా విదేశాంగ శాఖ  
  • ఇరుదేశాల మధ్య చర్చలు మళ్లీ ప్రారంభం

న్యూఢిల్లీ, జూన్‌ 22: గల్వాన్‌ ఘర్షణలో తమ సైనికుల మరణాలపై ఇన్నాళ్లుగా దాస్తూ వస్తున్న చైనా ఎట్టకేలకు నోరు విప్పింది. భారత సైనికుల చేతిలో తమ కమాండింగ్‌ ఆఫీసర్‌, కొందరు సైనికులు చనిపోయారని సోమవారం వెల్లడించింది. కమాండింగ్‌ ఆఫీసర్‌ చనిపోయారన్న విషయాన్ని భారత్‌, చైనా లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సమావేశంలో సైనికాధికారులు చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సైనికుల మరణాల అంశాన్ని చైనా అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌' విశ్లేషకుల పేరుతో వెల్లడించింది. ‘చైనా సైనికులు 20 మంది కంటే తక్కువ చనిపోయారన్న విషయం వెల్లడిస్తే భారత్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది సరిహద్దుల వద్ద మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుంది. అందుకే చెప్పలేదు’ అని చైనా నిపుణులు విశ్లేషించినట్టు గ్లోబల్‌ టైమ్స్‌ నర్మగర్భంగా మరణాల సంఖ్యను వెల్లడించింది. 

తమ సైనికులు 20 మంది కంటే తక్కువే మరణించారని ప్రస్తావించింది. ఇండియాలోని నాయకులు తమ ప్రజల మెప్పు కోసమే భారత్‌ కంటే చైనా సైనికులే ఎక్కువగా చనిపోయినట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ‘చైనా వ్యతిరేక భావనను ఇండియా అదుపులో పెట్టుకోకపోతే 1962 కంటే ఘోరంగా దెబ్బతింటుంది. ఈ విషయం భారత ప్రధాని మోదీకి కూడా తెలుసు. కానీ ప్రజల మెప్పు కోసం గట్టిగా మాట్లాడుతున్నారు. చైనాతో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని చూస్తున్నారు’ అని విశ్లేషకుల పేరిట విషం కక్కింది. ఇదిలా ఉండగా, గల్వాన్‌ ఘర్షణలో చైనాకు చెందిన 40 మంది సైనికులు చనిపోయారన్న కేంద్ర మంత్రి వీకే సింగ్‌ వ్యాఖ్యలపై స్పందించడానికి చైనా విదేశాంగ శాఖ నిరాకరించింది. అందుకు సంబంధించిన  సమాచారం ఏదీ తమ దగ్గర లేదని సమాధానాన్ని దాటవేసింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా.. సింగ్‌ వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆయన ‘మీకు  చెప్పడానికి నా దగ్గర ఆ సమాచారం లేదు’ అని సమాధానమిచ్చారు. మరోవైపు గల్వాన్‌ ఘర్షణ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌, చైనా మధ్య లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. వీటికి ఇండియా తరఫున 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ నేతృత్వం వహిస్తున్నారు. జూన్‌ 6న కుదిరిన ఒప్పందంపై ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వస్తారని పలువురు ఆశాభావం వ్యక్తంచేశారు. మే నెలలో చైనాతో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇరుదేశాల సైనికుల మధ్య లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి చర్చలు జరగడం ఇది రెండోసారి. కాగా, సరిహద్దుల్లో భద్రతాదళాల సన్నద్ధతపై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణే సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఒక్కొక్కరిది ఒక్కోమాట..

గల్వాన్‌ ఘర్షణలో మా కమాండింగ్‌ ఆఫీసర్‌ చనిపోయారు.                 

 - సైనిక చర్చల్లో అధికారులు

గల్వాన్‌ లోయలో చైనా సైనికులు 20 మంది కంటే తక్కువే చనిపోయారు. భారత్‌పై ఒత్తిడి పెరుగుతుందనే చైనా ఈ వివరాలను వెల్లడించలేదు.       

  - గ్లోబల్‌ టైమ్స్‌ కథనం

గల్వాన్‌లో ఎంతమంది చనిపోయారన్న సమాచారం ఏదీ నా దగ్గర లేదు.

- సోమవారం విలేకరుల సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌

సరిహద్దు వెంబడి ప్రత్యేక బలగాలు

చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపింది. పర్వత ప్రాంతాల్లో పనిచేయడానికి శిక్షణ పొందిన ఈ బలగాలు.. ఎత్తైన ప్రాంతాల్లో చైనా అతిక్రమణను సమర్థంగా తిప్పికొట్టగలవు. వాహనాలు కూడా వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లి యుద్ధం చేయగలవు. కార్గిల్‌ యుద్ధ సమయంలో కూడా ఈ బలగాలు కీలక పాత్ర పోషించాయి. మరోవైపు సరిహద్దుల్లో నిర్మాణంలో ఉన్న 32 రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణంపై కేంద్ర హోంశాఖ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. విద్య, టెలికాం, విద్యుత్‌, ఆరోగ్య  సదుపాయాలను కూడా పెంచాలని ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.


logo