ఆదివారం 24 జనవరి 2021
National - Jan 06, 2021 , 11:44:49

అనాగ‌రిక‌ ఆయుధాల‌తో చైనా దాడి : ర‌క్ష‌ణ‌శాఖ రిపోర్ట్‌

అనాగ‌రిక‌ ఆయుధాల‌తో చైనా దాడి : ర‌క్ష‌ణ‌శాఖ రిపోర్ట్‌

న్యూఢిల్లీ:  ల‌డాఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనా దురాక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే.  జూన్ 15వ తేదీన రెండు దేశాల సైనికులు భీక‌ర ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఆ ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. ఆ ఘ‌ట‌న గురించి ర‌క్ష‌ణ‌శాఖ త‌న వార్షిక నివేదిక‌లో కొన్ని అంశాలు  వెల్ల‌డించింది.  చైనా సైనికులు ఏక‌ప‌క్షంగా, రెచ్చ‌గొట్టేవిధంగా దురాక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ ఆరోపించింది.  బ‌ల‌ప్ర‌యోగంతో వాస్త‌వాధీన రేఖ‌ను మార్చేందుకు చైనా సైనికులు ప్ర‌య‌త్నించిన‌ట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది.  కానీ భార‌తీయ బ‌ల‌గాలు ఆ కుయుక్తుల్ని ధీటుగా ఎదుర్కొన్నాయ‌ని,  మ‌రింత ఉద్రిక్త‌త‌కు దారితీయ‌కుండా ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ వెల్ల‌డించింది.  

డ్రాగ‌న్ దేశం చైనా చేస్తున్న క‌వ్వింపు చ‌ర్య‌ల‌ను భార‌తీయ ద‌ళాలు స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకున్న‌ట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.  భార‌తీయ ఆర్మీ ఎటువంటి విప‌త్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ గురించి ప్ర‌స్తావించిన ర‌క్ష‌ణ శాఖ‌.. జూన్ 15వ రోజున జ‌రిగిన స‌మ‌యంలో చైనా వైపు కూడా భారీ సంఖ్య‌లో సైనికులు మ‌ర‌ణించిన‌ట్లు వార్షిక నివేదిక‌లో వెల్ల‌డించారు.   భార‌త ద‌ళాలు అన్ని ఒప్పందాల‌కు త‌గిన‌ట్లు వ్య‌వ‌హరించాయ‌ని, కానీ పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ మాత్రం అనాగ‌రిక‌ ఆయుధాల‌తో, భారీ సంఖ్య‌లో ఉద్రిక్త‌త‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ పేర్కొన్న‌ది. గ‌త 8 నెల‌ల నుంచి రెండు దేశాల మ‌ధ్య ల‌డాఖ్‌లో సరిహ‌ద్దు ఉద్రిక్త‌త నెల‌కొని ఉన్న‌ది.  ప‌లు ద‌ఫాలు దౌత్య‌ప‌ర‌మైన‌, సైనిక చ‌ర్య‌లు జ‌రిగినా.. ప్ర‌తిష్టంభ‌న మాత్రం అలాగే కొన‌సాగుతున్న‌ది. అడ్వాన్స్ వింట‌ర్ స్టాకింగ్ ప్ర‌క్రియ‌లో భాగంగా శీతాకాలానికి సంబంధించిన అన్ని వ‌స‌తుల‌ను ఆర్మీకి క‌ల్పించిన‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ చెప్పింది.     


logo