సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 17:38:26

సరిహద్దులో ఎయిర్‌ డిఫెన్స్‌ రెట్టింపు చేసిన చైనా

సరిహద్దులో ఎయిర్‌ డిఫెన్స్‌ రెట్టింపు చేసిన చైనా

న్యూఢిల్లీ: చైనా గత మూడేండ్లలో సరిహద్దులో ఎయిర్‌ డిఫెన్స్‌ను రెట్టింపు చేసింది. భారత్‌, చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో కొత్తగా 13 సైనిక స్థావరాలు, ఎయిర్‌ బేసులు, ఎయిర్‌ డిఫెన్స్‌ యూనిట్లను నిర్మించింది. 2017లో డొక్లాంలో భారత్‌తో ఘర్షణ అనంతరం చైనా వీటి నిర్మాణాలను చేపట్టింది. తాజాగా లఢక్‌ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో నాలుగు హెలీకాప్టర్ల స్థావరాలను కొత్తగా నిర్మిస్తున్నది. బెల్జియం కేంద్రంగా పని చేసే ప్రముఖ సెక్యూరిటీ అండ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కన్సల్టెన్సీ సంస్థ స్ట్రాట్‌ఫోర్ మంగళవారం దీనిపై ఒక నివేదికను విడుదల చేసింది. సరిహద్దులో కొత్తగా మూడు ఎయిర్‌ బేసులు, ఐదు శాశ్వత ఎయిర్‌ డిఫెన్స్‌ యూనిట్లు, ఐదు హెలీకాప్టర్ల  స్థావరాలను చైనా నిర్మించినట్లు తెలిపింది. ఇందులో నాలుగు హెలీకాప్టర్‌ స్థావరాల నిర్మాణాలు లఢక్‌ సంక్షోభం తర్వాత మే నెలలో చైనా చేపట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధి సిమ్ టాక్ ఆ నివేదికలో పేర్కొన్నారు. 2017లో డొక్లాం సంక్షోభం తర్వాత చైనా తన వ్యూహాత్మాక లక్ష్యలను మార్చుకున్నదని, దీంతో గత మూడేండ్లలో భారత్‌ సరిహద్దులో ఎయిర్‌ బేస్‌, డిఫెన్స్‌ యూనిట్లు, హెలీకాప్టర్లను రెట్టింపు చేసిందని ఆ రిపోర్టులో ప్రస్తావించారు. 

లఢక్‌లో ఘర్షణ అనంతరం కొత్తగా నాలుగు హెలీకాప్టర్లను మోహరించడంతోపాటు అదనపు రన్‌ వేలు, సైనిక కేంద్రాలను చైనా నిర్మిస్తున్నదని ఆ నివేదిక తెలిపింది. 2016కు ముందు టిబెటన్‌ సరిహద్దులో ఒక హెలికాప్టర్‌, ఒక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ మాత్రమే ఉండగా 2017లో డొక్లాం ఘర్షణ అనంతరం వీటి సంఖ్య రెట్టింపు అయినట్లు గ్రాఫిక్స్‌తో సహా వివరించింది. 2019లో కొత్తగా నాలుగు ఎయిర్‌ బేస్‌లు, నాలుగు ఎయిర్‌ డిఫెన్స్‌ ప్రాంతాలు, ఒక హెలీకాప్టర్‌ను చైనా మోహరించగా ఈ ఏడాది లఢక్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో కొత్తగా నాలుగు ఎయిర్‌ బేసులు, నాలుగు హెలికాప్టర్లు, ఒక ఎయిర్‌ డిఫెన్స్‌ ప్రాంతాన్ని చైనా అభివృద్ధి చేసినట్లు స్ట్రాట్‌ఫోర్ వెల్లడించింది. భారత్‌ సరిహద్దులో పటిష్ఠమైన ఎయిర్‌ డిఫెన్స్‌ను ఏర్పాటు చేసుకోవడంతోపాటు భారత శక్తిసామర్థ్యాల లోపాలను అనుకూలంగా మలచుకోవాలని చైనా భావిస్తున్నట్లు ఆ నివేదికలో విశ్లేషించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo