సోమవారం 18 జనవరి 2021
National - Dec 02, 2020 , 01:16:29

కయ్యాల డ్రాగన్‌

కయ్యాల డ్రాగన్‌

  • భూటాన్‌ భూభాగంలో మరో గ్రామం నిర్మాణం
  • రోడ్డు నిర్మాణం కోసం నది ప్రవాహంలోనే మార్పు
  • బ్రహ్మపుత్ర నదిపై మరో భారీ డ్యామ్‌కు ప్లాన్‌
  • భారత్‌ను వ్యూహాత్మకంగా దెబ్బతీయాలని కొత్త కుట్రలు

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నా చైనా.. భారత్‌తో కయ్యాలు మానుకోవడంలేదు. వివాదాస్పద ప్రాంతం డోక్లాం సమీపంలో భూటాన్‌ భూభాగంలోకి రెండు కిలోమీటర్లు చొచ్చుకువెళ్లి ఇటీవలే ఓ గ్రామాన్ని నిర్మించిన ఆ దేశం మరింత రెచ్చిపోయింది. భూటాన్‌ భూభాగంలోని ‘అమో చూ’ నదికి సమీపంలో కొత్తగా మరో గ్రామంతో పాటు రహదారి, బంకర్లు, బ్రిడ్జిని నిర్మించింది. ఈ మేరకు ‘మ్యాక్స్‌ర్‌' టెక్నాలజీస్‌ సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతున్నది. తాజా నిర్మాణాలు.. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి కారిడార్‌కు సమీపంలో ఉన్నాయి. దీంతో భారత్‌లోని కీలక సరిహద్దు ప్రాంతాలపై చైనా నిఘాను మరింత పటిష్టం చేసే అవకాశమున్నదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

రెడ్‌ లైన్లను దాటుకొని మరి..

2017లో డోక్లాం ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి చైనా పూనుకున్నది. దీనికి భూటాన్‌ వ్యతిరేకించింది. భూటాన్‌కు భారత్‌ అండగా నిలిచింది. ఫలితంగా చైనా-భారత సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో చైనా ఆర్మీ భారత్‌లోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో భారత్‌ పలు రెడ్‌ లైన్స్‌ను నిర్దేశించింది. దీనికి చైనా కూడా అంగీకరించింది. ఇందులో డోక్లామ్‌ నాలాకు దక్షిణ భాగం, అమో చూ నదికి తూర్పు భాగం కూడా ఉన్నాయి. అయితే, చైనా అమో చూ నదిపై తాజాగా నిర్మించిన బ్రిడ్జి.. తూర్పు ప్రాంతానికి (భారత్‌ సరిహద్దులు) చేరుకోవడానికి అవకాశమిచ్చేలా ఉన్నది. ఈ బ్రిడ్జి 40-45 మీటర్ల పొడవుతో, 6 మీటర్ల వెడల్పుతో ఉన్నది. తాజాగా నిర్మించిన గ్రామం, రహదారి, బంకర్ల కోసం భూటాన్‌ యాతుంగ్‌ లోయల్లోని అమో చూ నది ప్రవాహ మార్గాన్నే చైనా బలగాలు మార్చివేశాయి. ఇండ్లు, స్థావరాలు, 12 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం చెట్లను నరికివేశాయి.

జల యుద్ధం

ఆర్థిక సాయం పేరిట మభ్యపెట్టడం, ఆయు ధ సంపత్తిని చూపించి పొరుగు దేశాలను బెదిరించడం చైనాకు కొత్తేంకాదు. ఇలా చేసే టిబెట్‌ ప్రాంతం గుండా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదిపై ఇప్పటికే 11 డ్యామ్‌లను నిర్మించింది. ఇప్పుడు కొత్త డ్యామ్‌ నిర్మాణానికి పూనుకున్నది. భారత్‌-చైనా సరిహద్దులకు 30 కిలోమీటర్ల దూరంలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు సమీపంలో టిబెట్‌లోని మెడాగ్‌లో ఈ డ్యామ్‌ను చైనా నిర్మించనున్నది. హిమాలయాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది టిబెట్‌, భారత్‌, బంగ్లాదేశ్‌ గుండా 3,848 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నది. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. వివిధ దేశాల గుండా ప్రవహించే నదులపై ఆనకట్టలు నిర్మించే దేశాలు ఇతర దేశాలకు ఆ సమాచారాన్ని అందించాలి.  బ్రహ్మపుత్ర తమ దేశం గుండా ప్రవహించకపోయినా.. ఆ నదిపై ఆనకట్టలు నిర్మిస్తున్న చైనా.. ఆ సమాచారాన్ని భారత్‌కు ఇవ్వడంలేదు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశాన్ని ఎదుర్కొనడానికి సరిహద్దుల్లో భారత సైన్యం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నది. ఇది పసిగట్టిన చైనా ఆనకట్టల నిర్మాణంతో కొత్త కుట్రకు తెరలేపింది. డ్యామ్‌లను నిర్మించి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా కింది ప్రాంతాల ప్రజలకు (భారత్‌లోని ఈశాన్య రాష్ర్టాలు) నీటి లభ్యత లేకుండా చేయడం, కీలక సమయాల్లో డ్యామ్‌ గేట్లను ఒక్కసారిగా తెరిచి సైన్యం మౌలిక సదుపాయాను కొట్టుకుపోయేలా చేయడానికి డ్రాగన్‌ దేశం కుట్ర పన్నింది.

బ్రహ్మపుత్రపై భారత్‌ డ్యామ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌ సమీపంలో టిబెట్‌లోని మెడాగ్‌లో బ్రహ్మపుత్ర నదిపై భారీ హైడ్రో పవర్‌ డ్యామ్‌ను చైనా నిర్మించబోతున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. దాని ప్రభావం ఈశాన్య రాష్ర్టాలపై పడకుండా ప్రణాళికలు రచిస్తున్నది. ఈ క్రమంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఓ బహుళార్థక సాధక ప్రాజెక్టును నిర్మించే ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు జల్‌శక్తి మంత్రిత్వ శాఖలో కమిషనర్‌గా (బ్రహ్మపుత్ర, బారక్‌) పనిచేస్తున్న టీఎస్‌ మిశ్రా మంగళవారం వివరాలు వెల్లడించారు. 10 వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, 9.2 బీసీఎం (బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు) నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నట్టు వెల్లడించారు. దీని ద్వారా ఈశాన్య రాష్ర్టాల ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి, విద్యుత్‌ కోత సమస్యలను పరిష్కరించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.